నందమూరి బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు

balakrishna
టాలీవుడ్ పాపులర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ రోజు 54వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. బాలయ్య బాబు 1960 జూన్ 10న శ్రీ నందమూరి తారక రామారావు – బసవతారకమ్మ దంపతులకు మద్రాసులో జన్మించాడు. బాలకృష్ణ ఎన్.టి.ఆర్ గారి ఆరవ కొడుకు, అలాగే ఆయన బాల్యం అంతా చెన్నైలో గడిచింది. 1974 లో వచ్చిన ‘తాతమ్మ కథ’ సినిమాతో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఎమోషనల్, మాస్ ఎంటర్టైనర్స్ తీయడంలో బాలకృష్ణ గారికి ప్రత్యేక పేరుంది. ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్, ఫ్యాక్షన్ మరియు యాక్షన్ ఎంటర్టైనర్స్ సినిమాలతో మాస్ ప్రేక్షకులను మెప్పించి పెద్ద పెద్ద హిట్స్ అందుకున్నారు. ‘లెజెండ్’, ‘సింహా’, ‘నరసింహ నాయుడు’, ‘సమరసింహా రెడ్డి’, ‘భైరవ ద్వీపం’, ఆదిత్య 369′, ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘లారీ డ్రైవర్’, ‘మంగమ్మ గారి మనవడు’, ‘నారి నారి నడుమ మురారి’, ‘ముద్దుల మావయ్య’ లాంటి కొన్ని సినిమాలు బాలకృష్ణ కేరీలో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.

ఇటీవలే వచ్చిన ‘లెజెండ్’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా 40 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఏకైక సీనియర్ హీరోగా బాలకృష్ణ రికార్డ్ సృష్టించాడు. అలాగే ఈ సంవత్సరం ఆయనకి ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. హిందూపూర్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గా కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా సేవలందిస్తూనే తన అభిమానులను నిరుత్సాహపరచ కూడదనే ఉద్దేశంతో సినిమాలు కూడా చేయాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే సత్యదేవ దర్శకత్వంలో తన 98వ సినిమాని ప్రారంభించాడు. బాలకృష్ణ బర్త్ డే వేడుకలు ఈ రోజు రామకృష్ణ స్టూడియోస్ లో అభిమానుల మధ్య ఘనంగా జరగనున్నాయి.

నట సింహం నందమూరి బాలకృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version