త్యాగరాయ గానసభలో పురాణపండ శ్రీనివాస్ శబ్దం ‘హరోంహర ‘

త్యాగరాయ గానసభలో పురాణపండ శ్రీనివాస్ శబ్దం ‘హరోంహర ‘

Published on Nov 6, 2019 12:33 PM IST
Puranapanda Srinivas
Puranapanda Srinivas

హైదరాబాద్: నవంబర్: 6

గమ్యం, గమనం తెలిసిన రచయిత కాబట్టే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అన్వేషణా ప్రస్థానం భక్త పాఠకుల్ని సమాయత్త పరిచేలా ఉత్తేజ భరితంగా సాగుతోందని జస్టిస్ రామలింగేశ్వర రావు పేర్కొన్నారు.

జ్ఞానమహాయజ్ఞ కేంద్రం ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా ప్రచురించిన ‘ హరోంహర’ శివ మంత్ర మహాశక్తుల ప్రత్యేక గ్రంధాన్ని హైదరాబాద్ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు వేదికపై ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వర రావు మాట్లాడుతూ పురాణపండ శ్రీనివాస్ నిష్కపటత్వం, నిస్వార్ధ సేవ , అద్భుత రచనా సామర్ధ్యం , అసాధారణమైన వాక్పటిమ, అవిశ్రాన్తకృషి ఇవే ఆయనతో మనకి సాన్నిహిత్యాన్ని పెంచుతున్నాయని అభినందించారు. మహా ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆశీర్వచనంతో, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె.వి.రమణాచారి ప్రోత్సాహంతో ఈ సుందర మహత్తుల గ్రంధం ‘ హరోంహర’ వేలకొలది ప్రతులను ఉచితంగా వితరణ చేస్తున్న త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా వి.ఎస్.జనార్ధనమూర్తి ఈ సభకు అద్యక్షత వహించి ఆద్యంతం భక్తి రసభరితంగా నడిపించడం విశేషం.

పురాణపండ శ్రీనివాస్ తో ఈ చక్కని గ్రంధాన్ని శ్రీశైల క్షేత్రానికి సమర్పిస్తున్నహిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ , శ్రీకాళహస్తి క్షేత్రానికి సమర్పిస్తున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా, రాజమండ్రి ఉమా మార్కండేయ, కోటిలింగాల క్షేత్రాలకు సమర్పిస్తున్న భారతీయ జనతాపార్టీ ఎం.ఎల్.సి. సోము వీర్రాజు , గోదావరీతీర శైవ క్షేత్రాలకు సమర్పిస్తున్న వై.ఎస్.ఆర్.సి.ఫై. రాష్ట్ర నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితర ప్రముఖుల దైవీయ స్పృహతో కూడిన సేవను ఆయన ప్రస్తావిస్తూ … . ఈ పవిత్ర మహోద్యమంలో క్రియాశీలక ప్రాధాన పాత్ర వహిస్తున్న వారాహి చలన చిత్రం అధినేతలు సాయి కొర్రపాటి, శ్రీమతి రజని కొర్రపాటి లను జస్టిస్ రామలింగేశ్వరరావు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విఖ్యాత చారిత్రక నవలా రచయిత ప్రొఫెసర్ ముదిగొండ శివ ప్రసాద్, 108 వైద్యసేవల సృష్టికర్త వెంకట్ చెంగవల్లి, నోరి ట్రస్ట్ అధ్యక్షులు నోరి సుబ్రహ్మణ్యం, సాంస్కృతిక ప్రియులు వైఎస్సార్ మూర్తి, వై.రమాప్రభ, కె.శ్రీరామచంద్రమూర్తి తదితర ప్రముఖులు పురాణపండ శ్రీనివాస్ ఆధ్యాత్మిక సాహిత్య విస్తృత సేవను పలు కోణాలలో విశ్లేషించి అభినందించారు.

నూట ఇరవై ఎనిమిది పేజీలతో శ్రీశైల సంప్రదాయానుసారం వైదిక స్తోత్ర, మంత్ర విశేషాలతో, అపురూపమైన వ్యాఖ్యానంతో అందిన ‘ హరోం హర’ గ్రంధాన్ని కార్తీక మాసమే కాకుండా ఎప్పుడూ హాయిగా పారాయణం చేసుకునేలా రూపుదిద్ది, సంకలనీకరించి, రచించిన పురాణపండ శ్రీనివాస్ జీవన ధన్యత సాధించారని సభకు హాజరైన వందల కొలది ప్రేక్షకులు సైతం అభినందనలు వర్షించడం ఒక విశేషమైతే … ఇలాంటి సభను రక్తి కట్టించిన కళా జనార్ధన మూర్తి సమయస్ఫూర్తి మరొక విశేషం. తెలుగు రాష్ట్రాలలో పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధాలకు దేవస్థానాలలో, బయటా వున్న డిమాండ్ మనకి తెలియనిది కాదు. పుస్తకాలకి డిమాండ్ తగ్గిన ఈరోజుల్లో సైతం పురాణపండ శ్రీనివాస్ ఆధ్యాత్మిక గ్రంధాలకు భక్త పాఠకులలో వున్న ఆదరణ ఇంతా, అంతా కాదు. అద్భుతమైన ఆదరణ ఉంది. శ్రీనివాస్ బుక్స్ లో వున్న మహిమ అలాంటిది మరి.

harom hara book release by justice ramalingeswara rao written by puranapanda srinivas

సంబంధిత సమాచారం

తాజా వార్తలు