యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ, న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కబోతున్నట్లు ఫిలింనగర్ సమాచారం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘నిన్ను కోరి’, ‘టక్ జగదీష్’ చిత్రాల తర్వాత మూడోసారి కలిసి పనిచేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ‘ఖుషి’ వంటి విజయం తర్వాత శివ నిర్వాణ, నాని కోసం ఒక ఎమోషనల్ కథను సిద్ధం చేశారని, ప్రస్తుతం ఇనిషియల్ టాక్స్ నడుస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు నాని వరుస ఆసక్తికర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ‘ది ప్యారడైజ్’ విడుదల తర్వాత ప్రస్తుతం చిన్న విరామంలో ఉన్న నాని, సుజీత్ దర్శకత్వంలో రాబోయే ‘బ్లడీ రోమియో’ షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. దీంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే మరో ప్రాజెక్ట్ కోసం కూడా చర్చలు జరుపుతున్నారు. కథల ఎంపికలో వేగం పెంచిన నాని, రాబోయే రోజుల్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.


