ఇంటర్వ్యూ: సుధీర్ బాబు – నటుడు అనే ప్రతి ఒక్కరు ఇంద్రగంటిగారితో ఒక సినిమా చేసి తీరాలి !

ఇంటర్వ్యూ: సుధీర్ బాబు – నటుడు అనే ప్రతి ఒక్కరు ఇంద్రగంటిగారితో ఒక సినిమా చేసి తీరాలి !

Published on Jun 12, 2018 3:46 PM IST

హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం ‘సమ్మోహనం’. ఈ నెల 15వ తేదీన చిత్రం విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ఇంద్రగంటిగారిని మీరెప్పుడు కలిశారు ?
మా పరిచయం ఇప్పటిది కాదు. నా మొదటి సినిమా ‘ఎస్.ఎమ్.ఎస్’ తర్వాత ఆయన నన్ను కకలిసి ఒక కథ చెప్పారు. నిర్మాణ సంస్థతో సైన్ కూడ చేసుకున్నాం. కానీ అది ఆగిపోయింది. అదే ‘ఊహలు గుసగుసలాడే’. ఆ కథ శ్రీనివాస్ అవసరాలది.

ఇప్పుడు చేసిన ‘సమ్మోహనం’ ఎలా ఉండబోతోంది ?
‘సమ్మోహనం’ చిత్రం వాస్తవ జీవితానికి చాలా దగ్గరగా ఉండే కథతో తెరకెక్కించబడింది. పూర్తి రొమాంటిక్ లవ్ స్టోరీ. కొత్తగా ఉంటుంది.

ఇందులో మీ పాత్ర గురించి చెప్పండి ?
ఇందులో నా పేరు విజయ్. జీవితంలో ఒక గోల్ పెట్టుకుని పనిచేస్తుంటాను. సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండని పాత్ర.

మీ కోస్టార్ అదితిరావ్ హైదరి పాత్ర ?
ఆమెదే ముఖ్యమైన పాత్ర. ఇందులో ఆమె ఒక స్టార్ హీరోయిన్. నిజ జీవితంలో నటులు మేకప్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటారు, మేకప్ తీసినప్పుడు ఎలా ఉంటారు అనేది ఆమె పాత్రలో చూడవచ్చు. అదితి చాలా బాగా నటించింది. పాత్ర రాసేటప్పుడే ఇంద్రగంటిగారు అదితిని అనుకున్నారు.

ఈ సినిమా ద్వారా పరిశ్రమను విమర్శించడం జరిగిందా ?
లేదు. సినిమా పట్ల, సెలబ్రిటీల పట్ల ప్రజల్లో ఎలాంటి భావం ఉంది అనేదే ఈ సినిమాలో చెప్పాం. అంతేగాని ఎవ్వరినీ కావాలని ఉద్దేశించి విమర్శలు చేయలేదు.

మోహన్ కృష్ణగారి దర్శకత్వం ఎలా ఉంది ?
చాలా బాగుంది. ఆయనతో వర్క్ చేయడం ఒక గొప్ప అనుభవం. సినిమా మొత్తం వాస్తవానికి దగ్గరగా ఉండేలా తీశారు. నేను చేసిన సినిమాల్లోకెల్లా ఇదే బెస్ట్ అని చెప్పగలను. ఒక నటుడిగా ఈ సినిమా పట్ల నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. ఆయనతో పనిచేస్తుంటే సినిమా చేసినట్టు ఉండదు. వాస్తవంలో ఉన్నట్టే ఉంటుంది. ఆయనొక వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తారు.

మరి మోహన్ కృష్ణగారితో మరొక సినిమా చేయమంటే చేస్తారా ?
తప్పకుండా. ఆయనతో ఒకటేంటి వంద సినిమాలైనా చేయొచ్చు. అంత మంచి దర్శకుడు. నటుడు అనే ప్రతిఒక్కరు ఆయనతో ఒక సినిమా చేసి తీరాలి.

నరేష్ గారి పాత్ర గురించి చాలా చెప్తున్నారు. మీరేమంటారు ?
ఆయన పాత్ర చాలా బాగుంటుంది. ‘గోల్కొండ హైస్కూల్’ చేసేటప్పుడు జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఆయన పాత్రను రాసుకుని ఈ కథ మొత్తాన్ని తయారుచేశారు ఇంద్రగంటి. నరేష్ గారి పాత్రలో ఫన్, ఎమోషన్ రెండూ ఉంటాయి.

సినిమాలో మీకు బాగా కష్టం అనిపించిన సన్నివేశం ఏమైనా ఉందా ?
ఒక రొమాంటిక్ సీన్ ఉంది. అది టెర్రస్ మీద ఓపెన్ ఏరియాలో జరుగుతుంది. ఆ సీన్ చాలా సహజంగా ఉంటుంది. అందుకే ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయి. కన్నీళ్లు రాకూడదు కానీ ఏడ్చినట్టు తెలియాలి. అలా ఉంటుంది సీన్. అది చేయడం కొంత కష్టమనిపించింది.

మీరెప్పుడూ కృష్ణగారు, మహేష్ బాబుగారి పేర్లను వాడుకోలేదు ఎందుకని ?
నేను ఇష్టపడి, ప్రేమించి సినిమాలోకి వచ్చాను. అలాంటప్పుడు కష్టపడి పనిచేయాలి. అంతేగాని అక్కడ కూడ వేరొకరి పేర్లు వాడుకుని అవకాశాలు రాబట్టుకోవడం నాకు నచ్చదు. అలా చేస్తే గౌరవం ఉండదు కూడ.

మీ తర్వాతి సినిమాలేంటి ?
గోపిచంద్ బయోపిక్ సెప్టెంబర్ నుండి మొదలవుతుంది. అలాగే కొత్త దర్శకుడు ఆర్.ఎస్.నాయుడుతో ఒక సినిమా చేస్తున్నాను. 80 శాతం పూర్తయింది. తర్వాత వీరభోగ వసంతరాయలు కూడ దాదాపు పూర్తైనట్టే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు