ఇంటర్వ్యూ : నందిత శ్వేత – ఈ పాత్రలో నటించడం చాలా కష్టం

Published on Dec 25, 2018 9:12 pm IST

గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సత్యదేవ్ కథానాయకుడిగా, నందిత శ్వేత కథానాయకిగా వస్తోన్న చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 28వ తేదీన రిలీజ్ కాబోతున్నది. కాగా ఈ సందర్భంగా హీరోయిన్ నందిత శ్వేత మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

బ్లఫ్ మాస్టర్ గురించి చెప్పండి ?

‘బ్లఫ్ మాస్టర్’ నాకు తెలుగులో మూడో సినిమా. ఈ సినిమా తమిళ్ సినిమా ‘సతురంగ వెట్టై’ కి రీమేక్ అని అందరికీ తెలిసిన విషయమే. తమిళంలో ‘సతురంగ వెట్టై’ మంచి విజయాన్ని అందుకుంది. నేను ఫస్ట్ టైం రీమేక్ సినిమాలో నటిస్తున్నాను.

మరి మీరు తమిళ్ సినిమా చూసారా ?

చూసాను. కాకపోతే ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా తేడాలు ఉన్నాయి. మా దర్శకుడు గోపీ గణేష్ పట్టాభిగారు తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారు. ఖచ్చితంగా తమిళ్ సినిమాకి తెలుగు సినిమాకి చాలా వేరియేషన్స్ ఉంటాయి.

బ్లఫ్ మాస్టర్ లో మీ పాత్ర గురించి చెప్పండి ?

ఈ సినిమాలో ఆవని అనే క్యారెక్టర్ లో నటించాను. ఆవని క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. సినిమాలోనే ఆవని పాత్ర చాలా కీలకమైనది. ఒక నటిగా చెబుతున్నాను ఆవని పాత్రలో నటించడం చాలా కష్టం.

అసలు మీ స్వస్థలం ఎక్కడ ? సినిమాల్లోకి ఎప్పుడు వచ్చారు ?

మాది బెంగళూరు అండి. నేను మోడల్‌ గా చేస్తోన్న సమయంలో.. 2008 అనుకుంటా.. ఓ కన్నడ సినిమాలో ఫస్ట్ టైం అవకాశం వచ్చింది. అలా సినిమాల్లోకి వచ్చాను.

మీకు తెలుగు సినిమాలో ఎలా అవకాశం వచ్చింది ?

నా మొదటి తెలుగు సినిమా ‘ఎక్కడకు పోతావు చిన్నవాడా’. ఆ సినిమాలో నేను చేసిన అమల క్యారెక్టర్ నాకు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది.

మీ తదుపరి చిత్రాలు గురించి చెప్పండి ?

కన్నడ రాకింగ్ స్టార్ యష్ తో కలిసి ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తున్నాను. అలాగే తెలుగులో కూడా సెవెన్, అక్షర, ప్రేమకథా చిత్రమ్ 2 ఇలా వరుస సినిమాలు చేస్తున్నాను. ఇంకా మరో రెండు సినిమాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :