సూపర్ స్టార్ మహేష్ బాబు.. తెలుగు హీరోల్లో ప్రస్తుతం నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్న హీరో. తన ప్రతీ సినిమాలో యాక్టింగ్‌లో కొత్తదనాన్ని చూపిస్తూ ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకున్నాడు మహేష్. నటుడిగా మహేష్ స్థాయి ఏమిటన్నది ఆయన సినిమాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అలాంటి మహేష్‌కు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆ అభిమానుల్లో స్టార్లుగా ఎదిగిన సినీ ప్రముఖులు కూడా ఉన్నారు.
తాజాగా మహేష్ అభిమానుల లిస్ట్‌లో తానూ ఉన్నానని మరో స్టార్ హీరోయిన్ ప్రకటించింది. ‘విశ్వరూపం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అమెరికన్ నటి, నిర్మాత పూజా కుమార్.. మహేష్‌కు తాను పెద్ద అభిమానినని తెలిపింది. కామెడీ, డ్రామా, ఫ్యామిలీ, యాక్షన్ ఇలా ఏ రకమైన సన్నివేశమైనా మహేష్ చాలా ఈజీగా చేసేస్తాడని పూజా తెలిపింది. ‘హీరో అనే పదానికి సరైన నిర్వచనం మహేష్’ అని మహేష్‌పై ప్రశంసలు కురిపించింది పూజా. ఇక ఆమె హీరోయిన్‌గా నటించిన తాజా సినిమా ‘ఉత్తమ విలన్’ తెలుగు, తమిళ భాషల్లో మే 1న భారీ ఎత్తున విడుదల కానుంది.


