‘ప్రేమ కథా చిత్రమ్’ క్రెడిట్ కావాలంటే తీస్కోండి : ప్రభాకర్ రెడ్డి

‘ప్రేమ కథా చిత్రమ్’ క్రెడిట్ కావాలంటే తీస్కోండి : ప్రభాకర్ రెడ్డి

Published on Dec 8, 2015 3:00 PM IST

J-PRABHAKAR-REDDY
‘ప్రేమకథా చిత్రమ్’ అనే హర్రర్ కామెడీతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన దర్శకుడు జె. ప్రభాకర్ రెడ్డి. స్వయంగా సినిమాటోగ్రాఫర్ కూడా అయిన ప్రభాకర్ రెడ్డి మొదటి సినిమా సక్సెస్ తర్వాత చాలా కాలానికి తన కొత్త సినిమాతో మనల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ‘అనగనగా ఒక చిత్రం’ అన్న పేరుతో ప్రభాకర్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో శివ, మేఘశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘అనగనగా ఒక చిత్రం’ యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిత్ర విశేషాలను పంచుకుంది.

ఇక ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. తన మొదటి సినిమా తరహాలోనే లవ్, థ్రిల్లర్, కామెడీ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని తెలియజేశారు. ఇక మీ మొదటి సినిమా క్రెడిట్ మొత్తం దర్శకుడు మారుతికే వెళ్ళిపోవడం గురించి ఏమంటారూ? అన్న ప్రశ్నకు సమాధానంగా.. “చూడండీ.. ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమాకు నేనెంత కష్టపడ్డానో నాతో పాటు అందరికీ తెలుసు. ఆ సినిమా ఒక టీమ్ ఎఫర్ట్. చెప్పాలంటే ఆ సినిమా ద్వారా నాకు మారుతి గారు అన్నం పెట్టారు. అయితే సినిమా విడుదలయ్యాక అంతా తానే చేశానని చెప్పుకోవడం బాధనిపించింది. నాకైతే నేనేం చేశానో తెలుసు. ఓ దర్శకుడిగా పేరు కంటే ఆత్మ సంతృప్తి పొందామా లేదా అన్నదే చూస్తా. నాకు ఆ సినిమా సంతృప్తినిచ్చింది. ఇక క్రెడిట్ అంటారా? కావాలంటే తీస్కోండి. టైటిల్ కార్డే తీసుకుంటా అన్నా నాకు ఏ ఇబ్బందీ లేదు” అని తెలిపారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు