రాబోయే 2026 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల వేదికల విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) గట్టి షాక్ ఇచ్చింది. భద్రతా కారణాల రీత్యా తమ మ్యాచ్‌లను ఇండియా నుంచి వేరే దేశానికి మార్చాలని బంగ్లాదేశ్ చేసిన రిక్వెస్ట్‌ను ఐసీసీ స్పష్టంగా తిరస్కరించింది. ఇండియాలో ప్లేయర్ల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని, మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తేల్చి చెప్పింది.
భద్రతపై అనుమానాలు.. వేదిక మార్పు కోరిన బంగ్లాదేశ్
ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) టీమ్ నుండి బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేసిన తర్వాత, రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య వాతావరణం కాస్త వేడెక్కింది. రాజకీయ కారణాలు మరియు ఇక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమ ప్లేయర్లు ఇండియాలో పర్యటించడం సేఫ్ కాదని బంగ్లాదేశ్ భావించింది. తమ ప్రభుత్వం సూచనల మేరకు, ఇండియాలో జరగాల్సిన తమ వరల్డ్ కప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.
ఐసీసీ రియాక్షన్: ఇండియాలో “నో రెడ్ ఫ్లాగ్”
మంగళవారం జరిగిన ఒక వర్చువల్ మీటింగ్‌లో ఐసీసీ అధికారులు మరియు బంగ్లాదేశ్ బోర్డు ప్రతినిధులు ఈ విషయంపై చర్చించారు. ఇండియాలో బంగ్లాదేశ్ టీమ్‌కు ముప్పు ఉందనడానికి ఎలాంటి ఆధారాలు (Specific Threats) లేవని ఐసీసీ స్పష్టం చేసింది. సెక్యూరిటీ పరంగా ఇండియాలో “రెడ్ ఫ్లాగ్” ఏదీ లేదని, కాబట్టి వేదికను మార్చాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
ఆడకపోతే పాయింట్లు గోవిందా!
షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను ఇండియాలోనే ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ భద్రతా కారణాలు చెప్పి టీమ్ ఇండియాకు రాకపోతే, టోర్నమెంట్‌లో ఆయా మ్యాచ్‌లకు సంబంధించిన పాయింట్లను కోల్పోవాల్సి వస్తుందని (Forfeit) ఐసీసీ హెచ్చరించినట్లు సమాచారం. ఇది కేవలం ద్వైపాక్షిక సిరీస్ కాదని, ఐసీసీ ఈవెంట్ అని అధికారులు గుర్తు చేశారు.
మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
ఫిబ్రవరి 7న మొదలయ్యే ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ గ్రూప్-సి లో ఉంది. షెడ్యూల్ ప్రకారం:
కోల్‌కతాలో వెస్టిండీస్, ఇటలీ మరియు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడాలి.
ముంబైలో నేపాల్‌తో తలపడాలి.
ప్రస్తుతానికి ఐసీసీ నిర్ణయం ఖరారైంది కాబట్టి, బంగ్లాదేశ్ టీమ్ వరల్డ్ కప్ కోసం ఇండియాకు ట్రావెల్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
