
ఇండియన్ సినిమాల్లో ఐఫా అవార్డులకు ఓ ప్రత్యేకత ఉంది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ పేరుతో 2000వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ అవార్డులు ఇండియన్ సినిమా అవార్డులంటే ఉండే క్రేజ్‌ను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇక ఇప్పటివరకూ బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఐఫా వేడుక మొదటి సారిగా సౌతిండియన్ సినిమానూ పలకరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. సౌతిండియన్ సినిమాలైన తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ ఇలా నాలుగు భాషల కళాకారులతో పెద్ద ఎత్తున మొదటి ఐఫా ఉత్సవాన్ని నిర్వహించేందుకు సంస్థ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
కాగా గత కొద్దిరోజులుగా చెన్నై నగరాన్ని భారీ వర్షాలు, వరదలు వణికిస్తోన్న నేపథ్యంలో ఉత్సవంలో భాగమైన తమిళ సినీ పరిశ్రమకూ ఇలాంటి సమయంలో మద్దతుగా నిలబడాలని ఐఫా సంస్థ ఉత్సవాన్ని జనవరి నెలకు వాయిదా వేసింది. ఎప్పట్నుంచే చేసుకున్న ఏర్పాట్ల ప్రకారం డిసెంబర్ 4నుంచి మూడు రోజుల పాటు హైద్రాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగాల్సిన ఉత్సవం ఈ తాజా పరిణామాలతో జనవరి నెలలో ఇదే వేదికపై జరగనుంది. ఇక జనవరి నెలలో ఏయే రోజుల్లో వేడుక నిర్వహించనున్నది త్వరలోనే తెలియజేస్తామని సంస్థ ఈ సందర్భంగా ప్రకటించింది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు నాలుగు సినీ పరిశ్రమలకు చెందిన టాప్ స్టార్స్ హాజరు కానున్నారు.

