ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. క్రికెట్ ఫ్యాన్స్‌కు క్షణక్షణానికీ ఉత్కంఠ పెంచిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచి దర్జాగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ విజయంతో ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన మన ఇండియన్ టీమ్ గ్రౌండ్ నలువైపులా పరుగుల వరద పారించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 253 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ముఖ్యంగా సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39), శివమ్ దూబే (25 బంతుల్లో 43) తమ బ్యాట్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివర్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వేగంగా పరుగులు రాబట్టడంతో టీమిండియా స్కోరు బోర్డు 250 దాటింది.
అయితే 254 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. తొలి ఓవర్లలోనే వికెట్లు పడినా.. 22 ఏళ్ల కుర్రాడు జాకబ్ బెతెల్ (Jacob Bethell) ఇండియన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 48 బంతుల్లోనే 105 పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు. విల్ జాక్స్ (35 పరుగులు) కూడా అతనికి చక్కటి సపోర్ట్ ఇవ్వడంతో మ్యాచ్ చివరి వరకు ఎవరిది విజయం అనేంత టెన్షన్ నెలకొంది. కానీ చివరకు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 246 పరుగుల వద్దే ఆగిపోయింది.
ఈ చారిత్రక విజయానికి అసలైన హీరోలలో ఒకరు అక్షర్ పటేల్. అద్భుతమైన ఫీల్డింగ్‌తో పాటు వెనక్కి పరుగెడుతూ పట్టిన క్యాచ్, బౌండరీ లైన్ వద్ద అందుకున్న రిలే క్యాచ్ మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పాయి. బౌలింగ్‌లో ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక డెత్ ఓవర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఎప్పటిలాగే తన మ్యాజిక్ చూపించాడు. పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లను కట్టడి చేసి ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచాడు. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా ప్రశాంతంగా బౌలింగ్ చేసి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు.
మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మొత్తానికి రెండు జట్లూ కలిపి దాదాపు 500 పరుగులు చేసిన ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక ఫుల్ మీల్స్‌లాంటి కిక్ ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అందరి కళ్లు ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ పైనే ఉన్నాయి.


