‘సినిమా బండి’… గమ్మత్తుగా ఉందండి

Published on Apr 30, 2021 9:00 pm IST

ఒక్కోసారి చిన్న కథలే పెద్ద విజయాల్ని సాధించిన పెడతాయి. పెద్ద పెద్ద హీరోలు, కోట్లకు కోట్లు బడ్జెట్లు పెట్టి తీసే సినిమాలు ఎందుకు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి అంటే వాటిలో కథ లేకనే. అందుకే సినిమాకు కథే హీరో అంటుంటారు. అలా కథలే హీరోలుగా వచ్చిన చాలా సినిమాలు ఈమధ్య కాలంలో మంచి హిట్లయ్యాయి. ఉదాహరణకు ‘కేరాఫ్ కంచరపాలెం’. ఇందులో నటించినవారు ఒక్కరంటే ఒక్కరు కూడ ప్రేక్షకులకు తెలిసినవాళ్ళు కాదు. కానీ సినిమా మ్యాజిక్ చేసింది. అందుకు కారణం అందులోని కథే.

అలాంటి కథనే తలపిస్తోంది ‘సినిమా బండి’. ప్రముఖ దర్శక ద్వయం, నిర్మాతలు అయినా రాజ్ అండ్ డీకే ఈ సినిమాను నిర్మించారు. ప్రవీణ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈరోజే ట్రైలర్ రిలీజ్ చేశారు. కెమెరాను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని వాళ్ళు సినిమా తీయాలని ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కథ. ఒక ఆటో డ్రైవర్ కి తన ఆటోలో కెమెరా దొరుకుతుంది. దాంతో తన స్నేహితులతో కలిసి సినిమా చేయాలని అనుకుంటాడు. అందులో ఆ ఊరి ఒక బార్బర్ కుర్రాడే హీరో. కూరగాయలమ్మే ఆమెని, స్కూల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న అమ్మాయిని హీరోయిన్ గా పెట్టాలని అనుకుంటున్నారు.

చేతిలో కెమెరా తప్ప ఇంకేమీ లేని ఆ బృందం సినిమా తీయడానికి పడిన పాట్లే ఈ సినిమా. ట్రైలర్ చూస్తే బలమైన కంటెంట్ ఉన్న సినిమానే అనిపిస్తోంది. ప్రతి ఒక్కరిలోనూ ఫిలిం మేకర్ ఉంటాడు అని చెప్పడమే కథకుడి అంతరంగమని అర్థమవుతోంది. మే 14న నెట్ ఫ్లిక్స్ ద్వారా చిత్రం రిలీజ్ కానుంది. మరి గమ్మత్తైన కథ కలిగిన ఈ చిన్న సినిమా ఎంత మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :