తెలుగునాట తన సొంత పేరుతో కన్నా ‘చిన్నారి పెళ్ళికూతురు’ ఆనందిగానే ఎక్కువగా పరిచయమున్న నటి అవికా గోర్. బుల్లి తెరపై సంచలనం సృష్టించిన ఈ యువ హీరోయిన్, ఆ తర్వాత వెండితెరపైనా తానేంటో నిరూపించుకుంది. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’, ‘లక్ష్మి రావే మా ఇంటికి’.. అంటూ ఫ్యామిలీ సినిమాలతో మెప్పించిన అవికా, తాజాగా ‘సినిమా చూపిస్త మావా’ అంటూ మన ముందుకు రానుంది. రాజ్ తరుణ్ హీరోగా, రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అవికా గోర్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) తెలుగులో టీనేజ్ అమ్మాయి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు పరిశ్రమ ఎలా ఉంది?
స) చాలా బాగుంది. నన్ను ఈ పరిశ్రమ చాలా బాగా రిసీవ్ చేసుకుంటోంది. నా వయసుకు తగ్గ పాత్రల్లోనే కొత్తదనం చూపిస్తూ వెళుతున్నా. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నన్ను బాగా ఇష్టపడుతున్నారు. స్వతహాగా నాకు కూడా అలాంటి సినిమాలే ఇష్టం. ఫ్యామిలీ, లవ్ సినిమాలు మనల్ని అందరికీ దగ్గర చేస్తాయి.
ప్రశ్న) ‘సినిమా చూపిస్త మావా’ ట్రైలర్ చూస్తే, మీ ఇంతకుముందు సినిమాలకు దగ్గరగా ఉన్నట్లుంది?
స) ‘సినిమా చూపిస్త మావా’ సింపుల్, క్యూట్ లవ్‌స్టోరీ. లవ్‌స్టోరీతో పాటుగా ఒక ఫాదర్ ఎమోషన్ కూడా ఉంటుంది. టైటిల్లో చెప్పినట్లుగానే రాజ్ తరుణ్, రావు రమేష్ గారి మధ్యన టాం అండ్ జెర్రీ తరహాలో సినిమా నడుస్తుంది. ఈ సినిమాకు నా గత సినిమాలతో పోలిక కనిపించిస్తుంది అంటే.. అది లవ్‌స్టోరీ అవ్వడం వల్లే అలా కనిపిస్తుందేమో! అయితే ఇది మరో మంచి ఎంటర్టైనింగ్ లవ్‌స్టోరీ అని మాత్రం నమ్మకంగా చెప్పగలను.
ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది?
స) ఈ సినిమాలో నేను ఓ బెంగాలీ అమ్మాయిగా కనిపిస్తా. ఆ అమ్మాయి నేపథ్యమంతా బెంగాలీ అయినా, పుట్టి పెరిగేది మాత్రం హైద్రాబాద్‌లోనే! దీంతో ఆ అమ్మాయి తెలుగే మాట్లాడినా దాంట్లో బెంగాలీ టచ్ కనపడాలి. ఆ చిన్న లాజిక్‌ను కూడా పట్టుకొని దానిపై చాలా వర్క్ చేశాం. తెలుగు వేగంగా మాట్లాడాల్సి రావడం ఈ సినిమా విషయంలో కొంత ఇబ్బంది పెట్టింది. ఈ సినిమాలో నా రోల్ కెరీర్లో మరో మంచి రోల్‌గా నిలబడుతుందన్న ధీమా ఉంది.
ప్రశ్న) రాజ్ తరుణ్‌తో ఇది మీ రెండో సినిమా. మీ కాంబినేషన్ మరోసారి స్క్రీన్‌పై రావడం ఎలా అనిపించింది?
స) రాజ్ తరుణ్‌తో నాకిది రెండో సినిమా. రాజ్, నేను.. అందరం ఒకే తరహా ఆలోచనలు ఉన్న వాళ్ళం కావడంతో బాగా కనెక్ట్ కాగలిగాం. ప్రతి ఆర్టిస్ట్ సెట్లో ఒక కంఫర్ట్ లెవల్ కోరుకుంటారు. ఈ సినిమా విషయంలో రాజ్‌తో సహా అందరూ నాకు చాలా సహాకరించారు. దీంతో షూటింగ్ అంతా కూల్‌గా సాగిపోయింది.
ప్రశ్న) ‘సినిమా చూపిస్త మావా’ దర్శకుడి గురించి చెప్పండి?
స) దర్శకుడు త్రినాథరావు గారికి లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ లాంటి విషయాలు చాలా బాగా తెలుసు. తాను చెప్పాలనుకున్న కథలో ఆ ఎమోషన్స్ ఉండేలా చూసుకున్నారు. ఒక బెంగాలీ అమ్మాయిగా కనిపించాలంటే అందుకు తగ్గ వేష భాషలు ఎలా ఉండాలనేది ఆయన బాగా రీసెర్చ్ చేసి చెప్పారు. దీంతో కొత్త తరహా పాత్రైనా చాలా సులువుగా చేసేశా.
ప్రశ్న) తెలుగు, హిందీ సినిమాలతో బిజీ అయిపోయారు. చదువు ఆపేసినట్లేనా?
స) అలాంటిదేమీ లేదు. చదువూ, యాక్టింగ్ రెండూ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి స్క్రీన్‌ప్లేలో ఆన్లైన్ కోర్స్ చేస్తున్నా. సినిమా షూటింగ్ మధ్యలోనూ కోర్స్ పూర్తి చేసే అవకాశం ఉండడంతో ఈ కోర్స్ చేస్తున్నా.
ప్రశ్న) స్క్రీన్‌ప్లే కోర్స్ చేస్తున్నా అంటున్నారు. అంటే భవిష్యత్‌లో రైటర్‌గానూ మారతారా?
స) నా గోల్ డైరెక్షన్. డైరెక్టర్ అవ్వాలంటే ముందు కథపై పట్టుండాలని ముందు ఈ కోర్స్ చేస్తున్నా. ఒక్క దర్శకత్వం అనే కాదు యాక్టింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా సినిమాకు సంబంధించిన అన్నీ ఇష్టమే! చిన్నప్పట్నుంచీ సినిమా, టీవీ సీరియళ్ళతోనే గడపడంతో ప్రస్తుతం సినిమాయే నా ప్రపంచం అయిపోయింది. నాకూ ఈ ప్రపంచంలో ఇలా ఉండడం సంతోషంగా ఉంది.


