
గతంలో అంతా కొత్తవాళ్ళతోనే సినిమాలు తీసి కూడా పలు బ్లాక్‌బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు తేజ, మళ్ళీ ఆ ట్రెండ్‌లో అంతా కొత్తవాళ్ళతో రూపొందించిన సినిమా ‘హోరా హోరీ’. కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో దిలీప్-దక్షలు హీరో హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హోరాహోరీ హీరోయిన్ దక్షతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు…
ప్రశ్న) ముందుగా మీ నేపథ్యమేంటి? సినిమాల్లోకి ఎలా వచ్చారు?
స) నేను మహారాష్ట్ర అమ్మాయిని. పుట్టి పెరిగిందంతా ముంబైలోనే. అయితే ప్రస్తుతం బెంగళూరులో ఉంటూ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నా. సినిమాలు, మోడలింగ్ అంటే చిన్నప్పట్నుంచీ మంచి ఆసక్తి ఉండేది. ఆ క్రమంలోనే మోడలింగ్ చేస్తున్నపుడే ‘హోరా హోరీ’ ఆఫర్ వచ్చింది.
ప్రశ్న) తేజ అంటే తెలుగులో స్టార్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ సినిమాలో అవకాశం వచ్చిందన్నపుడు ఎలా ఫీలయ్యారు?
స) తేజ సార్ ముంబైలో కూడా ఫేమస్. సినిమాటోగ్రాఫర్‌గా ఆయన హిందీ సినిమాలకు పనిచేయడంతో అక్కడ కూడా ఆయనకు మంచి పేరుంది. ఆయన సినిమాలో అవకాశమంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? మొదట ఈ సినిమాకు వేరే ఒక హీరోయిన్ సెట్ అయ్యారట. అయితే చివరి నిమిషంలో ఈ ఆఫర్ నాకు వచ్చింది. ఈ ఆఫర్ రాగానే చాలా హ్యాపీగా ఫీలయ్యా.
ప్రశ్న) ‘హోరా హోరీ’ సినిమా ఎలా ఉండబోతోంది?
స) ప్రేమ కోసం చేసే ఓ పోరాటం లాంటి కథతో ఈ సినిమా రూపొందింది. ‘ఫైట్ ఫర్ లవ్’ అన్న ట్యాగ్‌లైన్ కూడా అందుకే పెట్టారు. ప్రేమలో మంచి, చెడు రెండూ ఉన్నాయి. ఈ రెండింటినీ అర్థం చేసుకోవడం ఎలా? ప్రేమ అంటే అసలైన అర్థం ఏంటి? లాంటి అంశాలను తేజ సార్ ఈ సినిమాలో ప్రస్తావించారు. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది.
ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ గురించి చెప్పండి?
స) హోరా హోరీలో నేను మైత్రి పేరుగల యువతిగా కనిపిస్తా. ఒక చిన్న మెడికల్ ట్రీట్మెంట్లో భాగంగా మైత్రి కొన్నాళ్ళు ప్రశాంతమైన ప్రదేశాల్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆ అమ్మాయి ప్రేమలో పడడం, ఆ తర్వాత ప్రయాణం.. ఇలా నడుస్తుందీ కథ. నా రోల్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఇక ఈ సినిమా 80% వర్షం నేపథ్యంలోనే నడుస్తుంది. మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా కానీ, ఆ తర్వాత షూటింగ్ అంతా కూల్‌గా జరిగిపోయింది.
ప్రశ్న) దర్శకుడు తేజతో పనిచేయడం గురించి చెప్పండి? సరిగ్గా నటించకపోతే ఆయన కొడతారని కూడా ప్రచారం ఉంది. మీకు అలాంటి అనుభవం ఏదైనా ఎదురైందా?
స) తేజ సార్‌తో పనిచేయడం నా అదృష్టం. దర్శకుడిగా ఆయన దగ్గర్నుంచి ఎంత నేర్చుకుంటామో, ఆయన జీవితం నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. నాకైతే ఆయనో యూనివర్సిటీలా కనిపిస్తారు. నవ్వుతూ, సరదాగానే అన్నీ చెప్తారు. అయితే షాట్ రెడీ అన్నాక మాత్రం అందరి దగ్గర్నుంచి 100% ఔట్పుట్ వచ్చే దాకా వదలరు. ఒక సీన్లో నేను ఎంతకూ ఏడ్వకుండా ఉండడంతో ఆయన గట్టిగా అరిచి, చెంపపై ఒక్కటిచ్చారు… అంతే వెంటనే ఏడ్చేశా! (నవ్వుతూ). ఒకటి మాత్రం వాస్తవం.. ఆయన ఏది చేసినా అది సినిమా కోసమే!
ప్రశ్న) హోరాహోరీ తర్వాత ఏవైనా సినిమాలు ఒప్పుకున్నారా?
స) ఇంకా ఏమీ లేదు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రస్తుతానికి ఆఫర్స్ వస్తున్నా, ‘హోరా హోరీ’ తర్వాతే కొత్త సినిమా ఒప్పుకునే ఆలోచనలో ఉన్నా.

