
హరీష్ శంకర్.. సరికొత్త క్యారెక్టరైజేషన్స్‌తో, హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో చూపించి ‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’ లాంటి హిట్స్ కొట్టిన దర్శకుడు. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన హరీష్ శంకర్, మళ్ళీ తనదైన మార్క్ చూపెడతానంటూ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో మనముందుకు వస్తున్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా, దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హరీష్ శంకర్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) ‘రామయ్యా వస్తావయ్యా’ పరాజయం తర్వాత ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అంటూ వస్తున్నారు. ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నారు?
స) ‘సుబ్రమణ్య ఫర్ సేల్’ సినిమా పక్కా నా స్టైల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు ఒక కమర్షియల్ సినిమాలో ఏమేం చూడాలని కోరుకుంటారో అవన్నీ ‘సుబ్రమణ్య ఫర్ సేల్’ సినిమాలో ఉన్నాయి. నేనెప్పుడూ అద్భుతమైన సినిమాలు చేస్తున్నానని చెప్పను. ప్రేక్షకులకు అర్థమయ్యే సినిమాలు తీయడమే నా పని. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇకపోతే ఈ సినిమాలో మొదటిసారి ఫ్యామిలీ ఎమోషన్‌ను కూడా క్యారీ చేశా.
ప్రశ్న) ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే టైటిల్ కథ ఏంటి? ఈ టైటిల్ పెట్టడానికి కారణం?
స) ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే టైటిల్ చాలాకాలం క్రితమే అనుకున్నా. షాపింగ్ మాల్స్‌లో ఆషాడం సేల్, శ్రావణం సేల్.. ఇలాంటి సేల్స్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ రోజుల్లో, నేను అప్పటికే రాసి పెట్టుకున్న ఒక క్యారెక్టరైజేషన్‌కు ఈ తరహా టైటిల్ పెడితే బాగుంటుందన్న ఆలోచనతో సుబ్రమణ్యం ఫర్ సేల్ పుట్టింది. ఇక ఈ టైటిల్‌కు జస్టిఫికేషన్ ఏంటీ అనడిగితే.. సినిమా చూడమని చెబ్తా(నవ్వుతూ..)
ప్రశ్న) సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో హరీష్ శంకర్ చూపించబోతున్న కొత్తదనం ఏంటి?
స) కథలనేవి ఎప్పుడైనా ఏ కొన్నో ఉంటాయండీ. అవే కథలను మన పరిస్థితులకు, నేపథ్యాలకు తగ్గట్టుగా మారుస్తూ పోతూంటాం. ఆ రకంగా మనం ఏ కథ చెప్పినా అది ఎక్కడో వచ్చిన కథకు కనెక్ట్ చేయబడి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సినిమా కూడా కొత్తది కాకపోవచ్చు, అయితే సినిమాగా ఈ కథను ఎంత అందంగా చెప్పాం? అనేదే ఇక్కడ ప్రధానాంశం. నావరకూ ఈ సినిమాలో స్క్రీన్‌ప్లేలో కొత్తదనం చూపించా. తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే ఫార్మాట్‌లోనే సాగుతూ స్క్రీన్‌ప్లే పరంగా కొత్తగా ఉంటుందీ సినిమా.
ప్రశ్న) సాయిధరమ్ తేజ్‌నే హీరోగా ఎంచుకోవడానికి కారణం?
స) ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కథ ఫిక్స్ కాగానే, అప్పుడే ఎస్టాబ్లిష్ అయిన స్టార్ హీరో కన్నా, కొత్తగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ అయితే బాగుంటుందని అనుకున్నా. సాయిధరమ్ తేజ్ పర్ఫెక్ట్ అనిపించాడు. రేపు ఈ సినిమాకు సాయిధరమ్ తేజ్ ఎనర్జిటిక్ యాక్టింగ్ కూడా మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుంది.
ప్రశ్న) మీ సినిమాలన్నీ హీరోయిజాన్ని హైలైట్ చేస్తూ రూపొందే జాబితాలో ఉంటాయి. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
స) చిన్నప్పట్నుంచీ నేను చూసి ఉన్న సినిమాల వల్ల అనుకోండి, హీరో ప్రధానంగా నడిచే మన పరిశ్రమ వల్ల అనుకోండి. నాకు హీరోయిజాన్ని ఓ స్థాయిలో చూపించాలన్నది బలంగా నాటుకుపోయింది. నా సినిమాలన్నీ ఆ కోవలోనే సాగుతాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా హీరో క్యారెక్టరైజేషన్ సరికొత్తగా ఉంటుంది. ఆ క్యారెక్టర్‌లోనే హీరోయిజంతో, పాటు ఫన్ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే హీరోయిజమనేది నా సినిమాకు ప్రధాన బలం.
ప్రశ్న) హీరోయిన్ పాత్ర గురించి, హీరోయిన్‌గా నటించిన రెజీనా గురించి చెప్పండి?
స) సాధారణంగా నా సినిమాలు హీరోతో మొదలై హీరోతో ముగుస్తుంటాయి. ఈ సినిమా హీరోయిన్ కథతో మొదలవుతుంది. హీరోయిన్ కథలోకే హీరో ఎంట్రీ ఇస్తాడు. అందరు అమ్మాయిలూ ఐడెంటిఫై చేసుకునే పాత్ర. రెజీనా చాలా చక్కగా నటించింది.
ప్రశ్న) ‘రామయ్యా వస్తావయ్యా’ ఫెయిల్యూర్ తర్వాత వస్తోన్న సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ఒక ఫెయిల్యూర్ తర్వాత వచ్చే పరిణామాలను ఎలా ఎదుర్కొన్నారు?
స) ‘రామయ్యా వస్తావయ్యా’ తర్వాత వచ్చే సినిమా మీకు డూ ఆర్ డై లాంటిదా? అని చాలామంది అడిగారు. నన్నడిగితే నేను ‘షాక్’ సినిమా తర్వాత చేసిన ‘మిరపకాయ్’ సినిమాయే నాకు డూ ఆర్ డై. ఆ తర్వాత సూపర్ హిట్స్ చూశా. ఫ్లాప్ కూడా చూశా. ఎప్పుడూ నార్మల్‌గానే ఉన్నా. నా అదృష్టం కొద్ది నన్ను నమ్మి సినిమాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టేలా సినిమాలు చేస్తూ పోవడమే నాకు తెలిసింది.
ప్రశ్న) ‘రామయ్యా వస్తావయ్యా’ తర్వాత మళ్ళీ దిల్‌రాజుతోనే సినిమా చేస్తున్నారు. కారణం?
స) కారణమంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ అయిందంటే అందుకు నాదే బాధ్యత. ఆ సినిమా తర్వాత కూడా ఆయన నా టాలెంట్‌ను నమ్మారు కాబట్టే మళ్ళీ సినిమా చేశారు. రేపు ఈ సినిమా అయ్యాక కూడా ఆయన బ్యానర్‌లో మరో సినిమా చేస్తా. ఆయన దర్శకుడికి ఫ్రీడమ్ ఇస్తూనే, గీత దాటినప్పుడల్లా అదుపులో పెడుతుంటారు. ఆ అండతో హ్యాపీగా సినిమా చేసేసుకోవచ్చు.
ప్రశ్న) తదుపరి ప్రాజెక్టులేంటి?
స) ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదండీ. రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యాక, ఓ నెల రోజుల పాటు ఈ సినిమా ప్రమోషన్స్‌తో సినిమాను ప్రేక్షకులకు చేర్చాక అప్పుడు కొత్త సినిమా గురించి ఆలోచిస్తా.

