ఇంటర్వ్యూ : లావణ్య త్రిపాటి – ‘బాహుబలి’ కోసం నన్నెవరూ సంప్రదించలేదు!

ఇంటర్వ్యూ : లావణ్య త్రిపాటి – ‘బాహుబలి’ కోసం నన్నెవరూ సంప్రదించలేదు!

Published on Dec 14, 2015 8:24 PM IST

Lavanya-Tripathi
‘అందాల రాక్షసి’ సినిమాతో అందరి మనసులనూ దోచుకున్న లావణ్య త్రిపాటి, ఈ మధ్యే వచ్చి సూపర్ హిట్ కొట్టిన ‘భలే భలే మగాడివోయ్’తో తెలుగులో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలను విడుదలకు సిద్ధ చేసిన లావణ్య, నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తెలుగు పరిశ్రమలో నటిగా తన ప్రయాణం గురించి, రానున్న సినిమాల గురించి లావణ్య చెప్పిన విశేషాలు..

ప్రశ్న) ‘భలే భలే మగాడివోయ్’ హిట్ తర్వాత మీ పారితోషికం పెంచారని వినిపిస్తోంది. నిజమేనా?

స) నిజమే! అయితే అది మరీ ఎక్కువేం కాదు. అదేవిధంగా నాకు నచ్చితే చిన్న సినిమాల్లో పారితోషికం తగ్గించి నటించడానికైనే సిద్ధం.

ప్రశ్న) ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో నాగార్జున లాంటి స్టార్ హీరో సరసన నటించారు. ఇకపై చిన్న హీరోలతో నటించడం తగ్గించేస్తారా?

స) అలాంటిదేమీ లేదు. చెప్పాలంటే నేను ‘సోగ్గాడే చిన్న నాయనా’ సినిమా ఒప్పుకున్నాకే నాని ‘భలే భలే మగాడివోయ్’, అల్లు శిరీష్ సినిమాలను ఒప్పుకున్నా. చిన్న హీరో, పెద్ద హీరో అన్న బేధమేమీ లేదు.

ప్రశ్న) ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోన్న మీ సినిమాలు ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘లోల్’, ‘అల్లు శిరీష్’ సినిమాల గురించి చెప్పండి?

స) ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో ఓ సాంప్రదాయ ఇల్లాలుగా కనిపిస్తా. ‘లోల్’ సినిమాలో నా పాత్రకు మూడు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇక అల్లు శిరీష్ సినిమాలో నేనో స్టూడెంట్‌గా కనిపిస్తా. ఇలా దేనికదే డిఫరెంట్ పాత్రలు రావడం సంతోషంగా ఉంది.

ప్రశ్న) ‘లోల్’ సినిమా ఎలా ఉండబోతోంది?

స) లోల్ సినిమా సస్పెన్స్ క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన సినిమా. ఈ సినిమాలోని కొత్తదనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ప్రశ్న) ‘బాహుబలి 2’ కోసం మిమ్మల్ని సంప్రదించారని వినిపిస్తోంది. ఎంతవరకు నిజం?

స) అవన్నీ పుకార్లే! ‘బాహుబలి 2’ కోసం ఇప్పటివరకూ ఎవరూ సంప్రదించలేదు. రాజమౌళి సినిమాలో ఆఫర్ వస్తే అది ఎంత చిన్న పాత్రైనా చేసేస్తా.

ప్రశ్న) ఈ మూడు సినిమాలు కాకుండా కొత్తవేం ఒప్పుకున్నారు?

స) ప్రస్తుతం ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మార్చి నెలలో ఆ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తా.

ప్రశ్న) నాగార్జునతో కలిసి నటించడం ఎలా అనిపించింది?

స) నాగార్జున గారితో కలిసి నటించడం వల్ల యాక్టింగ్ పరంగా చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన చాలా కూల్. కో స్టార్‌గా మంచి సపోర్ట్ ఇచ్చారు.

ప్రశ్న) మీకో సూపర్ హిట్ తెచ్చిపెట్టిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా అవకాశం ఎలా వచ్చింది?

స) దర్శకుడు మారుతి గారు నేను చేసిన ఓ స్పెషల్ ఫోటోషూట్ చూసి ‘భలే భలే మగాడివోయ్’ కోసం నన్ను సంప్రదించారు.

ప్రశ్న) ఒక సినిమాను సెలెక్ట్ చేసుకునే ముందు ఏయే అంశాలను లెక్కలోకి తీసుకుంటారు? తమిళ ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా?

స) ఆ సినిమాకు దర్శకులెవరు? కథేంటి అన్న అంశాలకు ప్రాధాన్యమిస్తా. తమిళం నుండీ చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే తెలుగులో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్టులకు నో చెప్పా.

ప్రశ్న) ప్రస్తుత జనరేషన్‌లో మీకిష్టమైన హీరోయిన్స్ ఎవరు?

స) నిత్యా మీనన్, పార్వతీ మీనన్‌లంటే చాలా ఇష్టం. వాళ్ళ యాక్టింగ్ బాగా నచ్చుతుంది.

తాజా వార్తలు