ఇంటర్వ్యూ: శ్రీనివాస్ రెడ్డి – నేను చేసే అన్ని సినిమాల్లోనూ కథే హీరో, నేను కాదు !

ఇంటర్వ్యూ: శ్రీనివాస్ రెడ్డి – నేను చేసే అన్ని సినిమాల్లోనూ కథే హీరో, నేను కాదు !

Published on Jun 20, 2018 4:42 PM IST

శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన తాజా చిత్రం ‘జంబ లకిడి పంబ’. ఈ నెల 22వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా చేసినట్టున్నారు ?
హీరోగా ఏం లేదండి. నేనిప్పటివరకు సోలోగా చేసిన ‘గీతాంజలి’ నుంచి ఈ ‘జంబ లకిడి పంబ’ వరకు అన్ని సినిమాల్లోనూ కథే హీరో, నేను కాదు.

ఇంతకుముందు లేడి గేటప్ లో ఏమైన యాక్ట్ చేశారా ?
లేదండీ. (నవ్వుతూ) నాకు ఇద్దరూ ఆడపిల్లలే. కానీ నేనెప్పుడూ ఇంతకుముందు అమ్మాయిల గెటప్ లో యాక్ట్ చెయ్యలేదు. ఏమైనా మగాడు అచ్చం లేడిలా నటించటమనేది టఫ్ టాస్కే.

మరి ఈ చిత్రంలో అచ్చం అమ్మాయిలా ఎలా నటించగలిగారు ? ఎవర్నన్నా దృష్టిలో పెట్టుకొని నటించారా ?
ప్రత్యేకంగా ఒకరినే దృష్టిలో పెట్టుకొని చెయ్యటం లాంటిది ఏం లేదు. కాకపోతే సీనియర్ నరేష్ గారు, రాజేంద్రప్రసాద్ గారు అమ్మాయిల పాత్రల్లో నటించిన సినిమాలు, అలాగే ‘చంటబ్బాయ్’ చిత్రంలో చిరంజీవిగారు చేసిన పాత్ర ఇలా అన్ని చూసి నేను ఏ స్కేల్లో చేస్తే బాగుంటుందో చూసుకొని చేశాను. అందరూ బాగా చేశాను అంటున్నారు. చూడాలి మరి.

అమ్మాయి పాత్రలో నటించడం కష్టమనిపించిందా ? లేక సరదాగానే చేసేశారు ?
డ్రెస్సింగ్ వరకైతే చాలా ఇబ్బంది అనిపించింది. లొకేషన్లో ఆ స్కట్, నైటీ లాంటివి వేసుకొని షూట్ చెయ్యటం అబ్బో.. అది తప్పితే, యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్ పరంగా పెద్దగా కష్టమేం అనిపించలేదు. మాములుగానే చేసేశాను.

అసలు ఈ కథ విన్నప్పుడు, మిమ్మల్ని అమ్మాయిలా నటించమన్నప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్ ఏమిటి ?
కథ విన్న వెంటనే ఈ కథ నానిగారికో, శర్వానంద్ గారికో అయితే బాగుంటుంది అనిపించింది. అంటే నేను విన్నప్పుడు లవ్ స్టోరీ ఎక్కువ ఉండేది. ఆ తర్వాత నన్ను హీరోగా అనుకున్నప్పుడు నాకు అనుగుణంగా స్క్రిప్ట్ ని మార్చారు.

పాత ‘జంబ లకిడి పంబ’ చిత్రానికి మీ ‘జంబ లకిడి పంబ’ చిత్రానికి ఏమైనా పోలికలు ఉన్నాయా ?
ఈ ప్రశ్ననే చాలామంది అడుగుతున్నారు. పెద్దగా పోలికలు ఏం ఉండవు. ఆ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ మారతాయి. మా సినిమాలో కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే మారతారు. ఆ మారటంలో కూడా బాడీలు మారవు, ఆత్మలు మాత్రమే మారతాయి. కానీ మా సినిమాకి ‘జంబ లకిడి పంబ’ టైటిల్ పెట్టడం చాలా బాగా హెల్ప్ అయింది. ఇది కామెడీ సినిమా అని ప్రేక్షకుల్లో ఒక ముద్ర పడిపోయింది.

మిమ్మల్ని లేడి గెటప్ లో చూశాక మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం అన్నారు ?
మా అమ్మాయి అయితే (నవ్వుతూ) మన ఇంట్లోకి ఇంకో కొత్త అమ్మాయి వచ్చిందని ఆటపట్టిస్తోంది. సాంగ్స్ ట్రైలర్స్ చూసి మా అమ్మానాన్న కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఎక్కడా అతిగా చేయలేదని అన్నారు. ముఖ్యంగా ఆడవాళ్లకి ఉండే ఇబ్బందులను కూడా ఈ చిత్రంలో చూపించాం. వాటి గురించి కూడా చాలా మెచ్చుకున్నారు.

హీరోగా వరుసగా సినిమాలు చేస్తారా ?
అదేం లేదండి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కంటిన్యూ చేస్తూ.. మధ్య మధ్యలో ఏదన్న మంచి కథ వస్తే, నేను హీరో అనను గాని ఇలాగే ట్రై చేస్తాను.

‘గీతాంజలి 2’ చేయబోతున్నారని విన్నాం. ఆ చిత్రంలో కూడా మీరేనా హీరో ?
ఇంకా నా దాకా రాలేదండీ. వాళ్ళు కూడా ఓన్లీ సినిమా చేద్దాం అని అనుకున్నారు అంతే. అసలు ఆ సినిమాలో నేను ఉన్నానా లేనా అని కూడా నాకింకా తెలియదు. ఆ సినిమా గురించి కోన వెంకట్ గారే ఏ విషయమైన చెప్పాలి.

మీ పక్కన కొత్త అమ్మాయి సిద్ధి ఇద్నానీ హీరోయిన్ గా చేసింది.ఆమెకు మొదటి సినిమా కదా ఎలా చేసింది ?
చాలా బాగా చేసిందండి. ఆ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి. షూటింగ్ ముందే నా సినిమాలన్నీ చూసి, నన్ను ఇమిటేట్ చెయ్యటానికి ప్రయత్నించేది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ బాగా రావటానికి ఆ అమ్మాయి ఎంతో హార్డ్ వర్క్ చేసింది. సినిమా రిలీజ్ అయ్యాక ఆమెకు మంచి పేరు వస్తుంది.

ప్రస్తుతం ఏయే సినిమాల్లో నటిస్తున్నారు ?
ప్రజెంట్ త్రివిక్రమ్, ఎన్టీఆర్ గారి సినిమా ‘అరవింద సమేత’లో, అలాగే రవితేజ శ్రీనువైట్లగారి సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. రిలీజ్ కి దగ్గర్లో అంటే గోపిచంద్ గారి ‘పంతం’, ‘వీరభోగవసంత రాయులు’లో కూడా చేశాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు