‘స్టూడెంట్ నెం:1’ నుండి ‘ఈగ’ సినిమా వరకు దర్శకధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన త్రికోటి, ‘దిక్కులు చూడకు రామయ్య’తో మెగా ఫోన్ పట్టుకున్నారు. తొలి చిత్రానికి ‘తండ్రి కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది’ అనే కొత్త, కొంచం వింత కాన్సెప్ట్ తీసుకుని ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఆ విధంగా దర్శకుడిగా సగం విజయం సాదించిన త్రికోటి ప్రేక్షకుల తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. అజయ్, నాగ శౌర్య హీరోలుగా సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని, రాజమౌళితో అనుభందాన్ని, ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. దర్శకుడు త్రికోటి చెప్పిన విశేషాలు మీకోసం…
ప్రశ్న) తెలుగు చిత్ర పరిశ్రమలో మీ ప్రస్థానం ఎలా మొదలైంది..?
స) ఆఫీసు బాయ్ గా నేను ఇండస్ట్రీలో ప్రవేశించాను. తర్వాత ఎడిటింగ్ వర్క్ నేర్చుకున్నాను. అప్పుడు అసిస్టెంట్ దర్శకులను చూసి నేను కూడా దర్శకత్వం వైపు అడుగులు వేశాను. రైటింగ్ స్కిల్స్ పెంచుకోవడంలో కృషి చేశాను. క్రాంతి కుమార్ గారి వద్ద అసోసియేట్ గా వర్క్ చేస్తున్న సమయంలో రాజమౌళి గారితో పరిచయం ఏర్పడింది. రాజమౌళి తొలి సినిమా నుండి ‘ఈగ’ వరకు ఆయన వద్ద పని చేశాను.
ప్రశ్న) ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా ఎలా ప్రారంభం అయ్యింది..?
స) ఈవివి సత్యనారాయణ, అల్లరి నరేష్ సినిమాలకు పని చేసిన గిరి అనే రచయిత చెప్పిన పాయింట్ నాకు బాగా నచ్చింది. అదే సమయంలో నేను దర్శకత్వ అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాను. కొత్త కథ, ప్రేక్షకులకు బాగా ఆదరిస్తారు అనే నమ్మకంతో నేను, గిరి కలసి కథను డెవలప్ చేశాం. సాయి గారికి కథ చెప్పడం, ఆయన ఓకే చేయడంతో సినిమా ప్రారంభమయింది.
ప్రశ్న) కథకు ఇన్స్పిరేషన్ ఏంటి..? నిజ జీవితంలో తండ్రి కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమించడం వంటి సంఘటనలు మీకు ఎదురయ్యయా..?
స) ఇప్పటివరకు ఈ తరహా కధాంశంతో తెలుగులో సినిమా రాలేదు. సొంతంగా రాసిన కథ ఇది. తండ్రి కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమించడం వంటి సంఘటనలు నిజ జీవితంలో ఎదురుకాలేదు. కాని, బయట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. పైకి చెప్పకపోయినా, అమ్మాయిలకు లైన్ వేయాలని ప్రతి మగాడిలో ఉంటుంది. ఆలాంటి సన్నివేశాలు మా సినిమాలో ఉంటాయి.
ప్రశ్న) అజయ్ ను హీరోగా తీసుకోవడానికి కారణం..? నిర్మాతలతో అజయ్ హీరో అయితేనే సినిమా చేస్తానని చెప్పేవారట..?
స) మన కథలో సత్తా ఉండడం ముఖ్యం కాదు, తెరపై కథలో భావోద్వేగాన్ని అద్బుతంగా పండించే నటుడు ఉండడం కూడా ముఖ్యమే. ‘ఇష్క్’ సినిమా చూసిన తర్వాత అజయ్ అయితే నా కథలో తండ్రి పాత్రకు పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించింది. అందుకే అతని కోసం పట్టుబట్టాను. సాయి కొర్రపాటి గారితో కూడా అజయ్ హీరో అయితేనే సినిమా చేస్తానని చెప్పాను. నా నమ్మకాన్ని అజయ్ నిలబెట్టాడు. నాగ శౌర్యకు తండ్రిగా అద్బుతంగా నటించాడు. సినిమాకు 100% న్యాయం చేశాడు.
ప్రశ్న) 14 ఏళ్ళ తర్వాత ఇంద్రజ తెలుగులో నటిస్తున్నారు. ఆమెను తల్లి పాత్రకు ఎంపిక చేయడానికి గల ప్రత్యేక కారణం..?
స) మొదటి నుండి తల్లి పాత్రకు హీరోయిన్ ను తీసుకోవాలని భావించాను. కథలో చాలా కీలకమైన పాత్ర అది. పెర్ఫార్మన్స్ చేయగల నటి కావాలి. ఇంద్రజ అయితే బాగుంటుందని ఓ ఫ్రెండ్ సూచించాడు. ఆమెను కలసి కథ చెప్పడం, ఓకే చేయడం జరిగిపోయాయి. ఆమెకు కథ బాగా నచ్చింది. రెగ్యులర్ తెలుగు సినిమాలలో తల్లి పాత్రలు చాలా రొటీన్ అయిపోయాయి. వాటికి భిన్నంగా ఇంద్రజ క్యారెక్టర్ ఉంటుంది.
ప్రశ్న) అజయ్ సీనియర్ నటుడు, నాగ శౌర్య కొత్త హీరో. పెర్ఫార్మన్స్ పరంగా ఎక్కడైనా అజయ్ డామినేట్ చేశాడా..?
స) ఎవరి క్యారెక్టర్ కు తగ్గట్టు వారు నటించారు. ఇద్దరివి డిఫరెంట్ క్యారెక్టర్స్, క్యారేక్టరైజేషన్ లు వేరు వేరుగా ఉంటాయి. అందువల్ల, పెర్ఫార్మన్స్ పరంగా ఇద్దరినీ కంపేర్ చేయడం తగదు. ఇద్దరూ బాగా నటించారు.
ప్రశ్న) నాగ శౌర్య క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
స) మూడవ సినిమాకే నాగ శౌర్యకు మంచి క్యారెక్టర్ లభించింది. నటుడిగా అతన్ని ఆవిష్కరించుకోవడానికి ఇదొక సదావకాశం. ఒకవైపు తల్లికి తండ్రి అన్యాయం చేస్తున్నాడు అనే ఆవేదన, మరొకవైపు తన ప్రేయసిని రక్షించుకోవాలనే తాపత్రయం. వీటి మధ్య 20 ఏళ్ళ కుర్రాడు ఎలా స్పందించాడు..? అతను ఎం చేశాడు..? అనేది నాగ సౌర్య క్యారేక్టరైజేషన్. క్యారెక్టర్ లో ఎమోషన్స్ బాగా పండించాడు.
ప్రశ్న) ఈ తరహా ప్రయోగాత్మక సినిమా చేసిన ప్రతి దర్శకుడు, క్లైమాక్స్ లో సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయారు. మీ సినిమా ఆ మరకను చెరిపేస్తుందా..?
స) కొత్త పాయింట్ ను డీల్ చేసిన విధానం చూసి ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు క్లైమాక్స్ బాగుందని చెప్తున్నారు. నిర్మాత దిల్ రాజు గారు అయితే కంట తడి పెట్టుకున్నారు. ఇలాంటి కథకు మంచి ముగింపు ఇచ్చావని అభినందిస్తున్నారు. కథ మీద మొదట నుండి నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. క్లైమాక్స్ షూటింగ్ చేసిన తర్వాత మిగతా సన్నివేశాలు తెరకెక్కించాను. సినిమాలో క్లైమాక్స్ వన్ అఫ్ ది హైలైట్ అవుతుంది.
ప్రశ్న) మొదటి సినిమాకు లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో పని చేసే అవకాశం లభించింది. ఎలా ఫీల్ అవుతున్నారు..?
స) కీరవాణి గారు & ఫ్యామిలీతో నాకు మంచి అనుభందం ఉంది. స్క్రిప్ట్ వర్క్, డైలాగ్ వెర్షన్ కంప్లీట్ అయిన తర్వాత బౌండ్ స్క్రిప్ట్ కీరవాణి గారి చేతిలో పెట్టాను. కథకు తగ్గట్టు అద్బుతమైన పాటలను కంపోజ్ చేశారు. లిరిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయంటే క్రిడిట్ అంతా ఆయనదే. రీ రికార్డింగ్ కూడా అద్బుతంగా చేశారు.
ప్రశ్న) సాయి కొర్రపాటి గారి బ్యానర్ లో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?
స ) ఏ దర్శకుడైనా ఆయన బ్యానర్ లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తారు. అత్యుత్తమ టెక్నీషియన్లను, మంచి నటులను నా మొదటి సినిమాకు ఇచ్చారు. బడ్జెట్ విషయంలో ఏనాడు ఆంక్షలు విధించలేదు. నేను చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చుపెట్టారు. సినిమాలో మీకు ఆ రిచ్ నెస్ కనపడుతుంది. పబ్లిసిటీ బాగా చేస్తున్నారు. ఇంతకంటే ఎం కావాలి.
ప్రశ్న) నాన్ కమర్షియల్, ప్రయోగాత్మక సినిమాతో దర్శకుడిగా పరిచయం అవడం రిస్క్ అనిపించలేదా..?
స) లేదండి. ఎటువంటి సినిమాకైనా కథ ముఖ్యం. డిఫరెంట్ స్టొరీ అయినా కమర్షియల్ సినిమాకి ఏమాత్రం తీసిపోని రీతిలో సినిమా తెరకేక్కించాను. పాటలు, సన్నివేశాల చిత్రీకరణలో ఆ భారితనం కనపడుతుంది. హీరోఇజం, ఫైట్లు మాత్రమే నా సినిమాలో లేవు. సినిమా విడుదల తర్వాత నాకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను.
ప్రశ్న) రాజమౌళి ప్రభావం మీ సినిమాపై ఎంత ఉంది..? ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఆయన స్పందన ఏంటి..?
స) రాజమౌళి గారి వద్ద సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నాను. సన్నివేశాలను ఎలా డీల్ చేయాలో నేర్చుకున్నాను. అన్ని తరహా సినిమాలను రాజమౌళి తీశారు. నాపై ఆయన ప్రభావం ఎంత ఉందొ సినిమా చూశాకా ప్రేక్షకులు చెప్పాలి. సినిమా ఫస్ట్ కాపీ రాజమౌళి గారు ఇంకా చూడలేదు. రషెస్ చూసిన తర్వాత కొన్ని సలహాలు ఇచ్చారు. బాగా తీశావని మెచ్చుకున్నారు.
ప్రశ్న) నాగార్జున, విజయ్(తమిళ) వంటి అగ్ర హీరోల సినిమా అవకాశాలు చేజారిపోయాయి. ఎప్పుడైనా బాధపడ్డరా..?
స) నన్ను నిరూపించుకునే అవకాశం వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాను. అంతే కాని, ఏనాడు పెద్ద హీరో అవకాశం చేజారిపోయిందని బాధపడలేదు. ఒకవేళ అవకాశాలు రాకపోయినా నా వెనుక రాజమౌళి ఉన్నారనే భరోసా ఉంది కదా..!
ప్రశ్న) చివరగా, ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా గురించి ప్రేక్షకులకు ఎం చెప్తారు..?
స) తరచూ తెలుగులో కొత్త కథలు, కొత్త సినిమాలు రావడం లేదనే మాట వినిపిస్తుంది. అటువంటి విమర్శలకు మా సినిమా చెక్ పెడుతుంది. సరికొత్త కథ, కథనాలతో ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాను తెరకెక్కించాం. ఫస్ట్ కాపీ చూసిన వారందరూ బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ నెల 10న సినిమా విడుదలవుతుంది. అంతిమంగా ప్రేక్షకులు ఇచ్చే తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాను.
ఫస్ట్ మూవీ ‘దిక్కులు చూడకు రామయ్య’తో త్రికోటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఆశిస్తూ, అల్ ది బెస్ట్ చెప్పి సెలవు తీసుకున్నాం.


