ఇంటర్వ్యూ: క్యాథరిన్ థెరిస్సా-ఏ పాత్రనైనా చేయగల వర్సిటైల్ యాక్టర్ అనిపించుకోవాలి.

Published on Oct 5, 2019 5:09 pm IST

వరుణ్ సందేశ్ నటించిన చమక్ చల్లో చిత్రంతో తెలుగు తెరకు పరిచమైన బ్యూటీ కేథరిన్ థెరిస్సా ఇద్దరు అమ్మాయిలు, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, జయజానకి నాయక వంటి చిత్రాలలో నటించింది. తాజాగా ఆమె సిద్దార్ధ సరసన చేసిన తమిళ డబ్బింగ్ చిత్రం వదలడు ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో క్యాథరిన్ మీడియా సమావేశంలో పాల్గొని ఈ మూవీ విశేషాలు పంచుకున్నారు.

‘వ‌ద‌ల‌డు’ చిత్రంలో మీ పాత్ర ఏమిటీ ?

పుట్టుకతోనే వాసనా జ్ఞానం లేని ఒక మధ్యతరగతి అమ్మాయిగా నా పాత్ర ఉంటుంది. ఈ చిత్రంలో నేను స్కూల్ టీచర్ గా చేస్తున్నాను.

అసలు ‘వ‌ద‌ల‌డు’ అని ఎందుకు పెట్టారు, సినిమా దేని గురించి?

‘వ‌ద‌ల‌డు’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఈ సినిమా కథే. మా చిత్రం ప్రస్తుత సమాజంలో పెరిగిపోయిన ఆహార కల్తీ గురించి అని చెప్పవచ్చు. ప్రజలలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోతుంది. దానికి కారణం ఆహార కల్తీ ఎక్కువ కావడమే. దీనిని అదుపు చేయడానికి మన దేశంలో సరైన చట్టాలు లేవు. ఇలాంటి విషయాలన్నీ మా చిత్రంలో చర్చిండం జరిగింది.

‘వ‌ద‌ల‌డు’ హారర్ చిత్రం అంటున్నారు, నిజమేనా?

నిజానికి ఈ చిత్రం హారర్ మూవీ కాదండి థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ చూసి ఎవరు భయపడరు. మాది అందరూ కలిసి చూడదగ్గ క్లీన్ యూ సర్టిఫికెట్ మూవీ. కాకపోతే కొంత శాతం హారర్ ఉంటుంది. అలాగే కొన్ని సూపర్ నాచురల్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.

‘వ‌ద‌ల‌డు’. మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నారా?

ఖచ్చితంగా…,ఎందుకంటే ఆహారం అనేది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. అందుకే ఇది యూనివర్సల్ స్టోరీ. కాబట్టి ఏ,బి,సి అనే వర్గ భేదాలు లేకుండా అన్ని తరగతుల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్మకం ఉంది.

హీరో సిద్దార్ద్ గురించి చెవుతారా?

సిద్ధార్ద్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. దేశంలో ఏ సంఘటన జరిగినా సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ ఉంటారు. ఈ మూవీలో ఆయనది ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ పాత్ర. ఆయనతో పనిచేయడం మంచి అనుభూతిని ఇచ్చింది.

తెలుగులో సెకండ్ హీరోయిన్ గానే చేస్తున్నారు ఎందుకు?

ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అని కాదంది స్క్రిప్ట్ లో మన పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏమిటీ, అన్నదే ముఖ్యం. సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యే గా చేశాను. ఆ చిత్రంలో మిగతా పాత్రలకంటే నాకే ఎక్కువ పేరొచ్చింది.

తెలుగులో ఎందుకు సినిమాలు తగ్గించారు?

అది కావాలని తీసుకున్న నిర్ణయం కాదు. మంచి స్క్రిప్ట్ తో కొత్త పాత్రలు చేయాలి. ఎప్పుడూ ఒకే పాత్రలు చేయడం వలన నాకు బోర్ కొడుతుంది, అలాగే ప్రేక్షకులకు నచ్చదు. అందుకే మంచి పాత్ర అనుకుంటేనే అంగీకరిస్తున్నాను.

వరల్డ్ ఫేమస్ లవ్ చిత్రంలో మీరు నటిస్తున్నట్లున్నారు?

అవును దర్శకుడు క్రాంతి మాధవ్ గారు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో ఒక అద్భుతమైన పాత్ర ఇచ్చారు. అది ఏమిటీ అనేది ఇప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే దర్శకులు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం.

తెలుగు బాగా మాట్లాడుతున్నారు, మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెప్పుకోవచ్చుగా?

ఇప్పటికే నేను గౌతమ్ నంద, చమ్మక్ చల్లో చిత్రాల్లో సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నాను. అలాగని ప్రతి దర్శకుడితో నేనే డబ్బింగ్ చెవుతానని అడగలేను. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి మాత్రం కచ్చితంగా ట్రై చేస్తాను.

మీ డ్రీం రోల్ ఏమిటీ?

నాకు డ్రీం రోల్ అని ఏమి లేదండి. కానీ వైవిధ్యం ఉన్న అనేక పాత్రలు చేయాలి, ఏ పాత్రనైనా చేయగల వెర్సిటైల్ యాక్టర్ అనిపించుకోవాలి. అందుకే తెలుగులో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసినా తమిళంలో యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు చేస్తున్నాను. మద్రాస్ సినిమాలో నేను చేసిన పాత్ర ప్రత్యేకం, అలాగే ఇప్పుడు ఈ చిత్రంలోని పాత్ర కూడా. ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే పాత్రలు చేయడమే నా డ్రీం రోల్.

ఈ చిత్ర డైరెక్టర్ గురించి చెప్పండి?

దర్శకుడు సాయి మాధవ్ గారికి ఇదే మొదటి చిత్రం. ఐతే ఎక్కడా కొత్త దర్శకుడనే భావన కలుగదు. ఆయన గతంలో కొన్ని ప్రముఖ తెలుగు మరియు తమిళ చిత్రాలకు రచయితగా, కో రైటర్ గా పనిచేశారు. నా పాత్ర నాకు చెప్పినది చెప్పినట్లుగా తెరకెక్కించారు.

మీ చిత్రానికి సంగీతం థమన్ సమకూర్చినట్లున్నారు?

అవును మా చిత్రంలో కేవలం రెండు పాటలే ఉంటాయి. కథ ప్రకారం ఆ రెండు పాటలు చాలు. ఇక థమన్ అందించిన ఆర్ ఆర్ అద్భుతం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలలో ఆయన బీజీఎమ్ అలరిస్తుంది.
ఏదైనా వెబ్ సిరీస్ లో మీరు నటిస్తున్నారా? లేదు.నెట్ ఫ్లిక్స్ చెందిన ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చింది, కానీ ఆ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో దానిని నేను వదులుకున్నాను.

మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటీ?

వరల్డ్ ఫేమస్ లవ్ చిత్రంతో పాటు తెలుగులో మరో చిత్రం చర్చల దశలో ఉంది.

సంబంధిత సమాచారం :

X
More