ఇంటర్వ్యూ: హీరో శ్రీ విష్ణు- అందరిలా డాన్స్ లు, ఫైట్లు చేస్తే ఎవరూ చూడరు.!

Published on Apr 23, 2020 1:31 pm IST

 

వైవిధ్యమైన చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా హీరో శ్రీవిష్ణు ని చెప్పుకుంటారు. నటుడుగా వెండితెరకు పరిచయమై హీరోగా ఎదిగారు శ్రీవిష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకటే కథ వంటి చిత్రాలు నటుడిగా ఆయన్ని ఆవిష్కరించాయి. గత ఏడాది ఆయన నటించిన బ్రోచేవారెరురా సూపర్ హిట్ గా నిలిచింది. హీరోగా ఎదగాలంటే ఇలాంటి చిత్రాలనే చేయాలనే ఫార్మట్ వదిలేసి కొత్త దారిలో వెళుతున్న శ్రీవిష్ణు తో 123తెలుగు.కామ్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ విశేషాలు…

 

లాక్ డౌన్ లో ఏమి చేస్తున్నారు?

లాక్ డౌన్ కి ముందు నేను రాజ రాజ చోళ చిత్ర షూటింగ్ లో ఉన్నాను. లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే షూటింగ్ ఆపివేసి ఇంటికి చేరుకోవడం జరిగింది. గత ఆరునెలలుగా నేను చాల బిజీగా ఉన్నాను. దీనితో నాకు వచ్చిన మెయిల్స్ కూడా చదవలేదు.నాతో సినిమా చేయాలని భావించి యంగ్ ఫిల్మ్ మేకర్స్ పంపిన మెయిల్స్ చదువుతున్నాను.

 

వరుసగా వైవిధ్యమైన చిత్రాలు చేస్తున్నారు కారణం?
అందరూ హీరోలలా నేను కూడా డాన్సులు, ఫైట్స్ చేస్తే ఎవ్వరు చూడరు . నాబలం ఎమిటో నాకు తెలుసు. అందుకే నేను అలాంటి సబ్జక్ట్స్ ఎంచుకుంటాను. ఇక నాకంటూ ఓ జోనర్, ప్రత్యేకత ఏర్పరుచుకున్నాక అందులో పోటీ ఉండదు. దాని వలన ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండే ఛాన్స్ దక్కుతుంది.

 

అందుకే మీరు కొత్త దర్శకులను ఎంచుకుంటారా?

నూతన దర్శకులు నన్ను తెరపై బాగా ఆవిష్కరించగలరని నమ్మకం ఉంది . అలాగే కొత్తవారు కావడంతో వారితో నేను ఈజీగా కలిసిపోతాను. అందుకే నేను నటించిన కొన్ని చిత్రాలలో నిర్మాతగా కూడా ఉన్నాను. అలా అని అసలు పెద్ద దర్శకులతో చేయననని కాదు, కొత్త వారితో చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాను.

 

మీరు ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతుంది, తగిన గుర్తింపు రాలేదనే ఫీలింగ్ ఉందా?

నేను చిత్ర పరిశ్రమకు పరిచయమై 12ఏళ్ళు అవుతుంది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాకి ముందు దాదాపు 30సినిమాలలో ప్రాధాన్యం లేని పాత్రలు, జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను. ఆ స్థాయిని నుండి ఇక్కడి వచ్చానంటే ఎంతో కొంత సాధించినట్టే. ఇక ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రాలు, కెరీర్ పట్ల చాలా సంతృప్తి కరంగా ఉన్నాను.

 

మీ నటన చాలా సహజంగా ఉంటుంది, దాని కోసం మీ ప్రేపరేషన్ ఏమిటీ?

దర్శకుడు నాకు పాత్ర గురించి చెప్పగానే ఆ పాత్రలో లీనం కావడానికి ప్రయత్నిస్తాను. నాదీ నీదీ ఒకటే కథ చిత్రంలో నేను స్టూడెంట్ రోల్ చేశాను. ఆ పాత్ర కోసం నా స్టూడెంట్ డేస్ మెమరీస్ గుర్తు చేసుకోవడంతో పాటు, మా తమ్ముడు ఫ్రెండ్స్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అబ్సర్వ్ చేశాను. అలా ఓ పాత్రకు సన్నద్ధం అవుతాను.

 

ఈ తరంలో మీమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన నటుడు?

హీరో విజయ్ సేతుపతి గారిని నేను చాలా ఇష్టపడతాను. మలయాళం సినిమాలు చూస్తున్నప్పటి నుండి ఫహాద్ ఫాసిల్ నటనకు పెద్ద అభిమానిని అయిపోయాను. ఆయన చాలా ఉన్నతమైన నటుడు.

 

హీరో నారా రోహిత్ మీకు బాగా ఆప్తుడు అనుకుంటాను?

నాకు గురించి నారా రోహిత్ ఆలోచించినంతగా ఎవరూ ఆలోచించరు. ఇన్నేళ్ల స్నేహంలో ఒక్కసారి కూడా రోహిత్ నా మనసుకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించింది లేదు. నేను బిజీగా ఉండి కాల్ చేయలేకపోయినా, ఆయన మర్చిపోకుండా కాల్ చేసే మాట్లాడతారు. ఇక ఎక్కడికి వెళ్లినా నాకోసం, మా ఫ్యామిలీ కోసం షాపింగ్ చేసి, ఆ వస్తువులు బహుమతిగా ఇస్తారు. రోహిత్ లాంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం.

 

ఇండస్ట్రీలో మీకు ఇంకా దగ్గర మిత్రులు ఎవరు?

అల్లు అర్జున్ గారు నా సినిమాలు బాగా ఇష్టపడతారు. నా కొత్త మూవీ విడుదలైన ప్రతి సారి నేను ఆయన కలుసుకుంటాం. ఆయనతో పాటు నారా రోహిత్, నాని మరియు ధరమ్ తేజ్ మంచి మిత్రులు.

 

మీ భవిష్యత్ ప్రాజెక్ట్స్ ఏమిటీ?

ప్రస్తుతం రాజ రాజ చోళ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరో మూడు కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించాల్సి వుంది. 2021 వరకు నేను చాలా బిజీగా ఉన్నాను.

సంబంధిత సమాచారం :

X
More