డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతోందన్న వార్త సినీ సర్కిల్స్‌లో పెద్ద సంచలనమే సృష్టించింది. గతంలో రజినీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్‌ను లోకేష్ తెరకెక్కిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, చివరి నిమిషంలో సమీకరణాలు మారి ఈ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను #AA23 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నారు.
అయితే, ఈ సినిమా లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ఇరుంబుకై మాయావి’ అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన లోకేష్.. “ప్రస్తుతానికి మేం ప్రాజెక్ట్‌ను ప్రకటించాం అంతే. నిర్మాణ సంస్థ నుండి వచ్చే అధికారిక సమాచారం కోసం వేచి చూడండి. ప్రస్తుతం మేమొక సినిమాపై పని చేస్తున్నాం” అని క్లారిటీ ఇవ్వకుండా సమాధానం దాటవేశారు.
లోకేష్ ఈ వార్తలను ఖండించకపోవడంతో, అల్లు అర్జున్ అభిమానులు ఇది ‘ఇరుంబుకై మాయావి’ అని గట్టిగా నమ్ముతున్నారు. అయితే, గతంలో లోకేష్ ఈ కథను సూర్య కోసం రాశానని చెప్పడంతో, ఇప్పుడు అదే ప్రాజెక్ట్ బన్నీ దగ్గరకు వెళ్ళిందా అని సూర్య అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై పూర్తి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


