‘జయలలిత’ పాత్రలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్న బాహుబలి నటి!

ramya-krishna
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన దగ్గర్నుంచి వస్తున్న అనేకమైన వార్తల్లో ఆమె జీవిత చరిత్రను సినిమాగా తీయడం అనేది కూడా ఒక ప్రధానమైన అంశంగా చర్చల్లో నిలుస్తోంది. కొంతమంది సినిమా ఔత్సాహికులు ఈ సినిమాలో జయలలిత పాత్రను ప్రముఖ నటి రమ్య కృష్ణ చేస్తే బాగుంటుందని, ఆమే ఆ పాత్రకు సరిపోతుందని అంటూ ఒక పోస్టర్ ను డిజైన్ చేసి దానికి ‘మథర్’ అనే టైటిల్ ను పెట్టి ‘ది స్టోరీ అఫ్ ఏ క్వీన్’ అనే ట్యాగ్ లైన్ కూడా సెట్ చేశారు.

దాన్ని చూసిన సినీ అభిమానులు కూడా రమ్యకృష్ణ అయితే జయలలిత పాత్రకు సరిగ్గా సరిపోతుందని అంటూ తన ఆసక్తిని తెలియజేశారు. ఈ విషయం పై మీడియా బాహుబలి నటి రమ్యకృష్ణను సంప్రదించగా ఆమె ‘ఇది ఎవరో ఫ్యాన్స్ క్రియేట్ చేసిన పోస్టర్. బాగుంది. నాకు ఇంతకు ముందు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదు. కానీ ఇప్పుడు ఉంది. ఎవరైనా మంచి స్క్రిప్ట్ తో నా వద్దకు వస్తే జయలలితగారి పాత్రలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. జయలలితగారు ఒక శక్తివంతమైన మహిళ. నాలాంటి ఎంతో మంది ఆడవాళ్లకు ఆమె స్ఫూర్తినిచ్చింది. అలాంటి ఆమె పాత్రలో నటించడం చాలా గౌరవంగా, అదృష్టంగా భావిస్తాను. ఈ ఫాంటసీ నిజమవ్వాలని నేను కొరుకుంటున్నాను’ అంటూ జయలలిత పాత్రను పోషించడం పట్ల తన ఇష్టాన్ని తెలిపారు.