
సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లతో బిజీగా ఉంటూనే వీలు చిక్కినప్పుడల్లా పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూంటారు. ఈ క్రమంలోనే గతంలో ‘హీల్ ఏ చైల్డ్’ అనే ఫౌండేషన్‌కు ప్రచారం కల్పించిన మహేష్, తాజాగా ‘రెయిన్బో హాస్పిటల్స్’కు గుడ్ విల్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సిద్ధమైపోయారు. రెయిన్బో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మహేష్ ఈ ఉదయం పాల్గొన్నారు. పలువురు చిన్నారులతో కలిసి ముచ్చటిస్తూ మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. “ఒక హాస్పిటల్‌కు, అందులోనూ చిన్నపిల్లలకు సంబంధించిన హాస్పిటల్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. రెయిన్ బో హాస్పిటల్స్ వారు నిర్వహించే ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో ఇకపై కూడా పాల్గొంటా”నని తెలిపారు. మహేష్ లాంటి సూపర్ స్టార్ తమ హాస్పిటల్‌కు అంబాసిడర్‌గా ఉండడం అదృష్టమని, ఆయనతో కలిసి చిన్న పిల్లల వైద్యం విషయంలో మరింత అడ్వాన్స్డ్గా ముందుకు వెళతామని రెయిన్ బో హాస్పిటల్స్ నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.