ఎట్టకేలకు సెన్సార్ పనులు ముగించుకున్న ‘జన నాయగన్’.. రన్‌టైమ్ ఎంతంటే..?

ఎట్టకేలకు సెన్సార్ పనులు ముగించుకున్న ‘జన నాయగన్’.. రన్‌టైమ్ ఎంతంటే..?

Published on Jul 9, 2026 7:17 PM IST

Jana Nayagan

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ అభిమానుల ఏడు నెలల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆయన కెరీర్‌లో చివరి చిత్రంగా వస్తున్న ‘జన నాయగన్’ ఎన్నో అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు దీనికి ‘ఏ’ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. అలాగే ఈ సినిమా రన్‌టైమ్‌ను 3 గంటల 3 నిమిషాలు గా లాక్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే, ఒరిజినల్ వెర్షన్ ‘భగవంత్ కేసరి’ కొంత వయొలెన్స్ కారణంగా యూ/ఏ సర్టిఫికెట్ పొందితే.. తమిళ రీమేక్ మాత్రం ‘ఏ’ సర్టిఫికెట్ అందుకోవడం విశేషం. దీన్ని బట్టి ఒరిజినల్ కథతో పోలిస్తే తమిళ నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో చాలా కీలకమైన, తీవ్రమైన మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది.

సెన్సార్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కావడంతో ఇక చిత్రబృందం అధికారికంగా విడుదల తేదీని ప్రకటించడమే మిగిలి ఉంది. నిజానికి ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపడంతో ప్రక్రియ ఆలస్యమైంది. ఆ తర్వాత నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మరింత సంక్లిష్టంగా మారి, ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు మార్గం సుగమమైంది.

తాజా వార్తలు