గ్లోబల్ స్థాయిలో ఎంత పాపులారిటీ ఉన్నప్పటికీ, సరైన హిట్ లేక బాలీవుడ్ భామ జాన్వీ కపూర్, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఇద్దరూ ప్రస్తుతం ఒకే విధమైన పీకల్లోతు నిరాశలో ఉన్నారు. ‘పెద్ది’ సినిమాలో తన పాత్ర తీరుపై వచ్చిన విమర్శలు జాన్వీకి నిరాశ కలిగించగా, వరుస డిజాస్టర్ల మధ్య శ్రీలీల కెరీర్‌కు ‘భగవంత్ కేసరి’ తప్ప మరో చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు ఏక్తా కపూర్, గునీత్ మోంగా కపూర్ ఒక క్రైమ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేస్తుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘పగలైట్’ ఫేమ్ ఉమేష్ బిష్త్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఇద్దరు భామల పెర్ఫార్మన్స్‌కు పెద్ద పరీక్షగా నిలవనుంది.
ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిపై చూపే విపరీతమైన ప్రేమాభిమానాలు, అబ్సెషన్ చుట్టూ తిరిగే ఈ కథలో అనేక ఊహించని ట్విస్టులు ఉండబోతున్నట్లు సమాచారం. చాలా కాలంగా హిందీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న శ్రీలీలకు ఈ ప్రాజెక్ట్ సరికొత్త ఆశలు చిగురింపజేస్తుండగా, ప్రస్తుతం ‘లగ్ లగ్ గలే’లో నటిస్తున్న జాన్వీకి కూడా ఇది అత్యంత కీలకమైన చిత్రంగా మారనుంది.
ప్రస్తుతం శ్రీలీల ప్రైవేట్ ఈవెంట్స్ దాటి సినిమా ఫంక్షన్లలో పెద్దగా కనిపించకపోయినప్పటికీ, ఆఫర్లు లేవు అనడం కంటే మంచి కథల ఎంపికపైనే దృష్టి పెట్టిందని సన్నిహితులు చెబుతున్నారు. సరైన బ్రేక్ కోసం చూస్తున్న ఈ ఇద్దరు గ్లామర్ క్వీన్స్ కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.


