శ్రీదేవి నట వారసురాలిగా సినీ రంగంలోకి ప్రవేశించింది జాన్వీ కపూర్. 2018లో ‘ధఢక్’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన జాన్వీ బోలెడంత క్రేజ్ భుజాన వేసుకుని వరుసగా సినిమాలు చేస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా ప్రేక్షకులు ఈమెను అభిమానిస్తున్నారు. ఇప్పటివరకు మూడు సినిమాలు చేసింది ఆమె. అయితే ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతోంది. కానీ ఆమెకు ఆఫర్లు మాత్రం తగ్గట్లేదు.
తాజగా బాలీవుడ్ పరిశ్రమలో వినిపిస్తున్న వార్తల మేరకు జాన్వీ ఏకంగా రూ. 39 కోట్లు పెట్టి ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ముంబైలో స్టార్లు నివసించే జూహూ విలే పార్లే ప్రాంతంలో ఈ ఫ్లాట్ ఉంది. డిసెంబర్ నెలలోనే ఆమె దీన్ని కొనుగోలు చేసిందట. అమితాబ్, అజయ్ దేవగన్, అనిల్ కపూర్ లాంటి పెద్ద స్టార్ల ఇళ్లకు సమీపంలోనే ఈ అపార్ట్మెంట్ ఉందట. 4,144 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఫ్లాట్ మూడు అంతస్తుల్లో విస్తరించి ఉంటుంది. ఇంత భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసిందంటే జాన్వీ ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో అనుకుంటున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ‘దోస్తానా 2’లో నటిస్తున్న జాన్వీ తమిళ చిత్రం ‘కొలమావు కోకిల’ హిందీ రీమేక్లో కూడ నటించనుంది.


