6 భాషల్లో ‘జయహో రామానుజ’.. రిలీజ్ డేట్ ఖరారు చేసిన మేకర్స్

6 భాషల్లో ‘జయహో రామానుజ’.. రిలీజ్ డేట్ ఖరారు చేసిన మేకర్స్

Published on Sep 3, 2026 8:00 AM IST

​లయన్ డా. సాయి వెంకట్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘జయహో రామానుజ’. బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

​ఈ సందర్భంగా దర్శకుడు సాయి వెంకట్ మాట్లాడుతూ, సమానత్వ భావనను సమాజానికి చాటిచెప్పిన రామానుజాచార్యుల జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. నాణ్యమైన పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్లే విడుదల కాస్త ఆలస్యమైందని, ప్రేక్షకులకు ఒక మంచి చిత్రాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. సినిమాలో తాను రామానుజాచార్యుల పాత్రతో పాటు మరో పది పాత్రల్లో కనిపిస్తానని ఆయన స్పష్టం చేశారు.

​చిత్ర నిర్మాత, నటి ప్రవళ్లిక మాట్లాడుతూ, సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన రామానుజాచార్యుల చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను రూపొందించినట్లు చెప్పారు. ఇందులో తను శ్రీకృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రలను పోషించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎఫ్‌పీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, దర్శకుడు సముద్ర, నిర్మాత రామసత్యనారాయణ తదితరులు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వార్తలు