
తమిళంలో చక్కటి అభినయంతో అక్కడ స్టార్‌గా వెలుగొందిన తారల్లో ఒకరు.. జ్యోతిక. తమిళంలోనే కాక, ఇటు తెలుగులోనూ చంద్రముఖితో పాటు ఠాగూర్, మాస్, షాక్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత తమిళ స్టార్ సూర్యను వివాహం చేసుకున్న కొన్నాళ్ళకు నటనకు దూరమయ్యారు జ్యోతిక. ఏడేళ్ల సినీ విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
మళయాళంలో హిట్టయిన ‘హౌ ఓల్డ్ ఆర్ యూ’ అనే సినిమా తమిళ రీమేక్ లో జ్యోతిక నటిస్తున్నారు. ఉమన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ‘36 వయధినిలె’ (36 ఏళ్ల వయస్సులో) పేరుతో ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా జ్యోతిక భర్త సూర్య నిర్మిస్తుండటం విశేషం. ‘2డి ఎంటర్టెన్మెంట్స్’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కేవలం 46 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇందులో జ్యోతికకు జోడీగా రెహమాన్ నటించారు. ఆమె క్లోజ్ ఫ్రెండ్ పాత్రలో అభిరామి నటించారు.
ఒక మహిళ పూర్తి జీవితాన్ని ప్రతిబింబించేలా ఈ ఫస్ట్‌లుక్‌ను డిజైన్ చేశారు. ఈ సినిమాలో జ్యోతిక నిండుగా, అందంగా కనిపిస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ మరింత ఆత్మవిశ్వాసంతో కెరీర్‌ను నిర్మించుకునేలా కనిపిస్తున్నారు.

