సమీక్ష : కల్కి – చివరి 20 నిమిషాలే ఆకట్టుకుంటుంది

సమీక్ష : కల్కి – చివరి 20 నిమిషాలే ఆకట్టుకుంటుంది

Published on Jun 29, 2019 3:02 AM IST
Kalki movie review

విడుదల తేదీ : జూన్ 28, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రాజశేఖర్‌, అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాత : సి.కళ్యాణ్
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్ : దాశరథి శివేంద్ర
ఎడిటర్ :  గౌతమ్ నెరుసు


రాజశేఖర్ హీరోగా ‘అ!’ వంటి ప్రయోగాత్మక చిత్రంతో ప్రశంసలందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కల్కి’. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించారు.ఈ చిత్ర టీజర్,ట్రైలర్ ప్రేక్షకుల ప్రశంసలందుకోవడం జరిగింది. రాజశేఖర్ విజయవంతమైన చిత్రం ‘గరుడవేగ’ తరువాత వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం ఎంతవరకు అందుకుందో చూద్దాం.

 

కథ:

 

కొల్లాపూర్ అనే గ్రామానికి చెందిన రెండు ప్రత్యర్థి వర్గాలు కొన్నేళ్లుగా ఆధిపత్య పోరు సాగిస్తూ ఉంటాయి. ఈ ఆధిపత్య పోరులో భాగంలో ఒక వర్గానికి చెందిన శేఖర్ బాబు హత్యకు గురికావడంతో హింస చెలరేగుతుంది. దీనితో అక్కడ ఏర్పడిన భయానక పరిస్థితులను ఆపడానికి,శేఖర్ బాబు హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ అధికారి కల్కి(రాజశేఖర్) వస్తాడు. శేఖర్ బాబు హత్యకు సంబంధించిన విచారణ మొదలుపెట్టిన కల్కికి కొన్ని నిజాలు విస్మయానికి గురిచేస్తాయి. ఆ మర్డర్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి, ఆ కేసును హీరో ఎలా పరిష్కారిస్తాడు అనేది తెరపైన చూడాలి.

 

ప్లస్ పాయింట్స్:

 

ఈ మూవీకి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి, ఖర్చుకు వెనుకాడకుండా తీసిన ప్రతి సన్నివేశం చాలా రిచ్ గా కనబడుతుంది. ఇక పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ తన పాత్రలో లీనమై నటించారు. రాజశేఖర్ ని పోలీస్ గా అద్బుతంగా ప్రెసెంట్ చేయడంలో దర్శకుడి ప్రతిభ కొట్టొచ్చినట్టు కనబడుతుంది.

హీరోయిన్ ఆదా శర్మ తన పాత్ర పరిధిలో నటనతో మెప్పిస్తుంది, ఇక మరో హీరోయిన్ నందితా శ్వేత సెకండ్ హాఫ్ లో తన పాత్రకు న్యాయం చేసే అవకాశం దక్కించుకుంది. ఇక మూవీలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చివరి 15నిముషాలు. ఆసక్తిరేపే కథనంతో ప్రేక్షకుడిని థ్రిల్ అనుభవించేలా చేయడంలో దర్శకుడు విజయం సాధించాడు. సినిమాలోని అసలు ట్విస్ట్ ని రివీల్ చేసే సన్నివేశాలు చాలా బాగా కుదిరాయి.

కేసు విషయంలో రాజశేఖర్ కి సహాయం చేసే జర్నలిస్ట్ పాత్రలో రాహుల్ రామకృష్ణ నటన పర్వాలేదనిపిస్తుంది,ఐతే బాగా పెరిగిన గడ్డం,జుట్టు ఆపాత్రకు అవసరం లేదన్న భావన కలుగుతుంది. ఇక కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితమైన పూజిత పొన్నాడ తన నటనతో అలరించింది. ప్రతినాయకుడి పాత్రలో అశుతోష్ రానా,సిద్దు జొన్నలగడ్డ ప్రధానమైన పాత్రల్లో తమదైన నటనతో సినిమాకు ఆకర్షణగా నిలిచారు.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ మూవీకి ప్రధాన బలహీనత సినిమా నిడివి. 2గంటల 20నిమిషాల నిడివి గల ఈ మూవీ నెమ్మదిగా సాగడంతో ప్రేక్షకుడికి 3గంటలు సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. ఎటువంటి మలుపులు ఆసక్తికర సన్నివేశాలు లేని మొదటి సగం ఆకట్టుకోదు. అలాగే రాజశేఖర్ ,ఆదా శర్మల మధ్య ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు పాతకాలపు సినిమా ఫార్మాట్ లో సాగడంతో ప్రేక్షకుడు కొత్తదనం ఫీలవ్వడు. ఇలాంటి కాలం చెల్లిన సన్నివేశాలు ఎడిట్ చేసినా మూవీకి ఉపయోగం.

కథనంలో తరచుగా పరిచయమయ్యే పాత్రలు ప్రేక్షకుడిని అయోమయంలో పడవేస్తాయి. దర్శకుడు చెప్పాలనుకున్న అసలు పాయింట్ చాలా సన్నివేశాల్లో డైవర్ట్ అవుతుంది.

 

సాంకేతిక విభాగం:

 

ముందుగా చెప్పిన విధంగా ఈ మూవీ నిర్మాణ విలువలు అద్భుతమని చెప్పాలి. అలాగే మూవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిత్రంలో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోసింది. సినీమాటోగ్రపీ తోపాటు ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. ఇక సంగీతం పర్వాలేదు అన్నట్లుగా ఉంది.

ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆలోచనా విధానం బాగున్నా దానిని తెరపై ఆవిష్కరించడంలో విఫలం చెందాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకుడ్ని దర్శకుడు మంచి అనుభూతి కలిగేలా చేయడంలో విజయం సాధించలేకపోయారు.అద్భుతంగా రాసుకున్న స్క్రీన్ ప్లే కేవలం సెకండ్ హాఫ్ లో మాత్రమే అలరిస్తుంది. సినిమా పతాక సన్నివేశాల్లో మాత్రం ఉత్కంఠ కలిగే మలుపులతో సినిమా ముగించి ప్రేక్షకుడు థ్రిల్ ఫీలయ్యేలా చేశాడు.

 

తీర్పు:

 

సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కల్కి’ మూవీ కేవలం సెకండ్ హాఫ్ మాత్రమే అలరిస్తుంది. చిత్రం చివరి 20నిమిషాల నేపధ్యం మినహా మిగతా మొత్తం చిత్రం అంత ఆసక్తికరంగా సాగదు. సహనంతో ఫస్ట్ హాఫ్ చూసిన ప్రేక్షకుడికి, రెండవ భాగం కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. సినిమా మొత్తం ఇతి మిద్దంగా చెప్పాలంటే ‘కల్కి’ కేవలం పర్వాలేదనిపించే చిత్రం మాత్రమే. అంచనాలు లేకుండా వెళ్లిన వారికి కొంచెం అనుభూతినిచ్చే ఆస్కారం ఉంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు