మెగాస్టార్ చిరంజీవి స్టార్ డమ్ ఏ స్థాయిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో అన్నయ్య అనే పిలుపును సొంతం చేసుకున్న ఏకైక హీరో ఆయన. అందుకే ఆయన వారసుల్ని సైతం ఆయన అభిమానులు సాదరంగా ఆహ్వానిస్తూ, విశేషంగా ఆదరిస్తున్నారు.
చిరు తర్వాత సినిమాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు అఖండమైన ఆదరణను అందించి, అగ్ర స్థానంలో నిలబెట్టిన మెగా ఫ్యాన్స్, ఆ తరవాత వచ్చిన అల్లు అర్జున్, రామ్ చరణ్ లను ఇప్పుడున్న స్టార్ హీరోల జాబితాలో ఉండేలా అభిమానం చూపారు. అలాగే వారి తర్వాత వరుసగా ఆరంగేట్రం చేసిన అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లకు కూడ సముచిత స్థానాన్ని కట్టబెట్టారు అభిమానులు.
ఈ హీరోలందరి ఎదుగుదల వెనక ఉన్న వాళ్ళ వాళ్ళ సొంత కృషి, నిలబడాలనే పట్టుదల గొప్పదే అయినా అభిమానుల ప్రోత్సాహం తరచూ గుర్తుచేసుకోదగినదే, గొప్పదే. అందుకే వాళ్ళు త్వరలో హీరోగా రంగప్రవేశం చేయనున్న చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ ను కూడ తమ పెద్ద మనసుతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటికే అభిమాన సంఘాలన్నీ కళ్యాణ్ దేవ్ ను మెగా హీరోల జాబితాలో చేర్చుకోగా మొన్న జరిగిన ‘విజేత’ ఆడియో వేడుకలో ఫ్యాన్స్ అందరూ దేవ్ కు తమ సంఘీభావాన్ని తెలిపారు. కాబట్టి మిగిలిందల్లా ఇప్పటి వరకు వచ్చిన హీరోలందరి మాదిరిగానే కళ్యాణ్ దేవ్ తనలో కూడ హీరో అవ్వాలనే తపన, కష్టించే తత్వం ఉన్నాయని నిరూపించుకోవడమే.


