ఎన్.హెచ్. ప్రసాద్ దర్శకత్వం వహిస్తూ, సుమలీల సినిమా బ్యానర్‌పై నిర్మించిన చిత్రం “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్”. వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత సహా పలువురు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్లో లాంచ్ చేశారు. కమర్షియల్ హంగులతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని మేకర్స్ తెలిపారు.
దర్శక నిర్మాత ఎన్.హెచ్. ప్రసాద్ మాట్లాడుతూ, ఇది బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినా, నాణ్యతలో రాజీ పడలేదన్నారు. శృంగారం (సెక్సువల్ డిజైర్స్) నేపథ్యంగా తీసుకున్నప్పటికీ, ఎక్కడా అసభ్యత లేకుండా, కవిత్వపు శైలిలో (పొయెటిక్ గా) చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆయన వివరించారు. ఈ సినిమాలో కాళిదాసు మేఘదూతం, జయదేవుడి గీత గోవిందం నుండి కొన్ని కవిత్వాలను ఉపయోగించినట్లు తెలిపారు. సినిమా విడుదల తర్వాత క్వాలిటీ మూవీ చేశారనే పేరు తప్పకుండా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
డీవోపీ శివశంకర వరప్రసాద్ మాట్లాడుతూ, ప్రసాద్ గారి డెడికేషన్తోనే ఉన్న వనరుల్లో మంచి విజువల్ క్వాలిటీ సాధించామని పేర్కొన్నారు. నటీనటులు చంద్రకళా, దినేష్, బుగత సత్యనారాయణ, జోగారావు మాట్లాడుతూ, నేటి సమాజంలోని సామాజిక అంశాలను ధైర్యంగా చూపించారని, తమ పాత్రలకు మంచి గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు పంపిణీదారు బాపిరాజు ప్రకటించారు.


