స్టార్ హీరోలిద్దరూ సీఎం కుర్చీ కోసం ఏకం కానున్నారా…?

Published on Nov 20, 2019 12:32 pm IST

ఇద్దరు సూపర్ స్టార్ లు రాజకీయంగా ఒకటైతే ఆ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. కలిసి మల్టీ స్టారర్ లు చేసిన వీరిద్దరూ, కలిసి రాజకీయంగా ఎదిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. విషయంలో కి వెళితే కమల్ హాసన్, రజిని కాంత్ ఏళ్లుగా వెండితెరనేలుతున్న హీరోలు. దాదాపు ఒకే సమయంలో కెరీర్ ఆరంభించిన ఈ ఇద్దరు హీరోలు కలిసి డజనుకుపైగా సినిమాలలో నటించారు. హీరోలుగా కలిసి ఎదిగిన వీరు, ఇప్పుడు రాజకీయంగా కూడా కలిసి ఎదగాలని చూస్తున్నారని సమాచారం.

గతకొన్ని రోజులుగా కమల్ హాసన్, రజిని అనేక కార్యక్రమాలలో కలిసి కనిపిస్తున్నారు. కమల్ హాసన్ కి చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ నూతన భవనం ఎదురుగా వీరిద్దరి గురువుగారైన కె బాలచందర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ, కమల్ 60ఏళ్ల సినీ వేడుకలో కూడా రజిని హాజరై సందడి చేశారు. దీనితో మీడియా రానున్న ఎన్నికలలో కలిసి పనిచేస్తారా అని అడుగగా… ఇద్దరు సానుకూలంగా స్పందించారు.

2021లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ప్రధాన పార్టీలైన అన్నా డీఎంకే, డీఎంకే మునుపటిలా పటిష్టంగా లేవు. జయలలిత, కరుణా నిధి మరణం వలన ఈ రెండు పార్టీలు గతంలోలా శాసించే స్థాయిలో లేవు. రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి ఇదే సరైన సమయం అని కమల్, రజిని భావిస్తున్నారా అని సందేహం కలుగుతుంది. వేరువేరుగా వెళ్లి పరాజయం పొందడం కంటే సమిష్టిగా పనిచేస్తే సీఎం కుర్చీ అందుకోవడం అంత కష్టమైన పని కాదు అని వీరి ఆలోచనగా తోస్తుంది. మరి చూడాలి ఏమి జరుగుతుందో.

సంబంధిత సమాచారం :

More