చిక్కుల్లో ‘ఉత్తమ విలన్’.. సినిమా వాయిదా!

Uttama-Villain

‘ఉత్తమ విలన్’ సినిమాకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురౌతున్నాయి. విభిన్న చిత్రాల ద్వారా, విభిన్న పాత్రల ద్వారా దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా నిలిచే నటుడు కమల్ హాసన్ తాజాగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’. తమిళ, తెలుగు భాషల్లో ఏప్రిల్ 17న ఏకకాలంలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సినిమా విడుదలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కడంతో సినిమా మళ్ళీ వాయిదా పడింది.

సినిమాలోని ఓ పాట హిందువుల మనోభావాలను కించపరచే విధంగా రూపొందిందని, ఈ సినిమాను నిలిపివేయాలని వీహెచ్‌పీ చెన్నైలో ఓ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి సినిమా యూనిట్ ఇంకా స్పందించలేదు. అయితే ఇదే క్రమంలో సినిమాను మే 1కి వాయిదా వేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించడం విశేషంగా కనిపిస్తోంది. ఈ సినిమా సెన్సార్ విషయంలో కమల్‌కు, సెన్సార్ సభ్యులకు చిన్న వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. చివరకు ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, దర్శకుడు లింగుస్వామి సహ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో సి. కళ్యాణ్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే కమల్ హాసనే సమకూర్చడం విశేషం. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ విభిన్నంగా కనిపిస్తున్నారు.

Exit mobile version