
మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా లాంచ్ అయిన డైనమిక్ హీరో వరుణ్ తేజ్ తన రెండో సినిమా ‘కంచె’కు విలక్షణ దర్శకుడు క్రిష్‌తో జతకట్టిన విషయం తెలిసిందే! మొదటి సినిమా ‘ముకుందా’తోనే హీరోగా మంచి మార్కులు కొట్టేసిన వరుణ్, ఇప్పుడీ రెండో సినిమా ‘కంచె’లో సరికొత్త పాత్రలో అందరినీ ఆశ్చర్యపరచేందుకు సిద్ధమయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడిచే ఈ సినిమాకు అప్పటి మూడ్‌ను తీసుకురావడానికి దర్శకుడు క్రిష్ చాలా కృషి చేశారు.
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ ఇలా విభిన్న సినిమాలతో తనదైన మార్క్‌ను చూపెట్టిన క్రిష్, ‘కంచె’ ద్వారా మరోసారి తన మార్క్ సినిమాతో సిద్ధమయ్యారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు కంచె ఫస్ట్ టీజర్‌ను విడుదల చేశారు. విడుదలైన కొద్దిసేపటికే ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. వరుణ్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. యుద్ధంలో పోరాట దృశ్యాలను చిత్రీకరించిన తీరు ఏ స్థాయిలో ఉన్నాయనే దానిపై టీజర్ చూశాక ఓ అంచనాకు వచ్చేయొచ్చు.
‘ప్రేమ యుద్ధంలోనూ ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది’ అన్న డైలాగ్, విజువల్స్ చూశాక ఇది తెలుగు సినిమాయేనా అనే ఆశ్చర్యాన్ని మిగులుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. క్రిష తనదైన బ్రాంద్ మార్క్‌తో రానున్నారనే విషయం టీజర్‌తో స్పష్టమైంది. ఇక సినిమా రిలీజ్ డేట్ అయిన అక్టోబర్ 2 వరకు వేచి చూడడమే!

