
మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా లాంచ్ అయిన డైనమిక్ హీరో వరుణ్ తేజ్ తన రెండో సినిమా ‘కంచె’కు విలక్షణ దర్శకుడు క్రిష్‌తో జతకట్టిన విషయం తెలిసిందే! మొదటి సినిమా ‘ముకుందా’తోనే హీరోగా మంచి మార్కులు కొట్టేసిన వరుణ్, ఇప్పుడీ రెండో సినిమా ‘కంచె’లో సరికొత్త పాత్రలో అందరినీ ఆశ్చర్యపరచనున్నారని తెలుస్తోంది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ లాంటి విలక్షణ కథాంశాల నేపథ్యంలో నడిచే సినిమాలను తెరకెక్కించిన క్రిష్, ఈ సినిమాను రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించారన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక ఈనెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కంచె ఫస్ట్‌లుక్, టీజర్లను విడుదల చేయనున్నారని సమాచారం. విజువల్స్ కట్టిపడేసే సినిమాగా ఈ సినిమా నిలవనుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చాలా జాగ్రత్తగా, మంచి ఔట్పుట్ వచ్చేలా జాగ్రత్త పడుతున్నారట. ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే!

