తెలుగులో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన నటి కోమలి ప్రసాద్ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతుంది. ‘మండవెట్టి’ అనే పవర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ద్వారా ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రం తన కెరీర్‌లో ఒక కీలకమైన మలుపు అని భావిస్తున్న కోమలి, కొత్త ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రేక్షకుల ఆశీస్సులు కావాలని కోరుతోంది. టస్కర్స్ డెన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం మధురై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
దర్శకుడు శరణ్ రాజ్ సెంథిల్ కుమార్ ఈ చిత్రాన్ని కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్‌గానే కాకుండా, మిస్టిసిజం మరియు ఎమోషన్స్ కలయికతో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఒక మహిళ తన జీవితంలో ఎదుర్కొనే పోరాటం, కోల్పోయిన వాటి కోసం పడే వేదన మరియు గుర్తింపు కోసం చేసే ప్రయత్నం వంటి అంశాలు ఈ కథలో ప్రధానంగా ఉండబోతున్నాయి. గతంలో ‘వెల్ల కుదిర’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న శరణ్ రాజ్, ఈ సినిమాలో పాత్రల అంతర్గత భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ కోమలి ప్రసాద్‌లోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నారు.
సాంకేతికంగా కూడా ఈ చిత్రం పక్కా ప్రణాళికతో రూపొందుతోంది. సినిమాటోగ్రాఫర్ ప్రకాశ్ విజువల్స్, దీపక్ వేణుగోపాల్ సంగీతం ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌కు బలాన్ని చేకూర్చనున్నాయి. కోమలి ప్రసాద్‌తో పాటు తేనప్పన్, గజరాజ్, అమృత వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తూ కథలోని డెప్త్‌ను పెంచనున్నారు. షూటింగ్ ప్రారంభ దశ నుండే యూనిట్ సభ్యులంతా కథలోని భావోద్వేగాలకు జీవం పోసేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విశేషాలను వెల్లడించనున్నారు.
ఇప్పటికే తెలుగులో ‘హిట్’, ‘రౌడీ బాయ్స్’, ‘లూజర్’ వంటి ప్రాజెక్టులతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోమలి ప్రసాద్, ఎప్పుడూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తున్నారు. గ్లామర్‌తో పాటు సహజ సిద్ధమైన నటనను ప్రదర్శించే ఆమెకు తమిళ తంబీలు ఎలాంటి ఆదరణ ఇస్తారో చూడాలి. ఒక బలమైన లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే, ఆమె తన కెరీర్‌ను చాలా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది.


