కృష్ణాష్టమి సందర్భంగా భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ను సీనియర్ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. నాగరాజ్ కొట్టే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ మార్కండేయుడి పాత్రను పోషిస్తున్నారు. జయశ్రీ మీడియా సమర్పణలో కలాల్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా విడుదలైన పోస్టర్లో బ్రహ్మాజీ కాషాయ వస్త్రాలు, రుద్రాక్ష మాలలు, చేతిలో ఆయుధంతో సంప్రదాయ ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తున్నారు. పౌరాణిక, భక్తిరస అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రానికి నాగరాజ్ కొట్టే కథ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, నటుడు రచ్చ రవి సంభాషణలు రాశారు.
ఈ చిత్రంలో ప్రదీష్ హీరోగా, వంగమయి పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. వీరితో పాటు మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బేతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా టీజర్, విడుదల తేదీ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాణ వర్గాలు తెలిపాయి.


