రెబల్ స్టార్ కృష్ణంరాజుగారికి అరుదైన గౌరవం దక్కనుంది. ఆయన్ను తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించబోతున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు మీడియాలో వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. కృష్ణంరాజుగారు ఎప్పటి నుంచో గవర్నర్ పదవి మీద ఆశతో ఉన్నారు. ఎంతో హుందాగా ఉండే ఆ పదవి దక్కితే బాగుంటుందని భావించేవారు. ఆయన కల ఇన్నాళ్లకు నెరవేరబోతోంది.
సినిమాల నుండి రాజకీయాల్లోకి టర్న్ తీసుకున్న కృష్ణంరాజుగారు మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి కొద్దికాలానికే బీజేపీలోకి ప్రవేశించారు. 1998లో బీజేపీ నుండి కాకినాడ లోక్ సభ స్థానంలో పోటీచేసి 1,65,000 భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డ్ నెలకొల్పారు. 1999లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో కూడ కాకినాడ ఎంపీగా గెలిచారు. అటల్ బిహారీ వాజ్పాయి నేతృత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా కూడ పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు అందులోకి వెళ్లిన రెబల్ స్టార్ మళ్ళీ తిరిగి బీజేపీ గూటికే చేరుకున్నారు. అప్పటి నుండి బీజేపీతోనే సాగుతూ కేంద్ర నాయకులకు సన్నిహితులయ్యారు.


