
‘ప్రేమ కథా చిత్రమ్’తో హిట్ జోడిగా పేరు తెచ్చుకున్న సుధీర్ బాబు, నందిత మరోసారి జంటగా నటించిన రొమాంటిక్ సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఆర్.చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హరి సంగీతం అందించారు. ప్రేమికుల రోజు, ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ కి ఈ సినిమా సిద్దమయింది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు నిర్మాత లగడపాటి శ్రీధర్. ఈ సమావేశంలో నిర్మాత ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ విడుదల తేదితో పాటు, సినిమా విశేషాలను వెల్లడించారు.
ఈవివి దర్శకత్వం వహించిన ‘ఎవడిగోల వాడిది’ సినిమాతో మా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ సంస్థ గత పదేళ్ళుగా ఉత్తమ సినిమాలను నిర్మిస్తూ వరుస విజయాలను అందుకున్నాం. ఈ ఏడాది మా సంస్థ నుండి వస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ విజయం సాదిస్తుంది. సినిమా యూనిట్ అందరూ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. జనవరి 25న విజయవాడలో ఆడియో విడుదల చేయబోతున్నాం. ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో ఆడియో సక్సెస్‌మీట్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తాం అని నిర్మాత లగడపాటి శ్రీధర్ తెలిపారు.

