శ్రీమంతుడిపై కేటీఆర్ ప్రశంసల జల్లు

శ్రీమంతుడిపై కేటీఆర్ ప్రశంసల జల్లు

Published on Aug 12, 2015 5:05 PM IST

ktr-srimanthudu
సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ ఓ పక్క బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే, మరోపక్క ఓ బలమైన కథాంశంతో అన్ని వర్గాల వారినీ ఆలోచింపజేసేలా చేస్తోంది. ఊరిని దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులు, సాధారణ ప్రేక్షకులు, బాక్సాఫీస్‌తో పాటు రాజకీయ వర్గాలను సైతం విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ‘శ్రీమంతుడు’పై ప్రశంసల జల్లు కురిపించగా, తాజాగా ఆ జాబితాలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా చేరిపోయారు.

భారత ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పథకం ప్రస్తుతం గ్రామాలకు ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్న నేపథ్యంలో శ్రీమంతుడు సినిమాను ఈ పథకానికి లింక్ చేసి కేటీఆర్ తన అభిప్రాయం తెలిపారు. “శ్రీమంతుడు గురించి ఈ సందర్భంగా తప్పక మాట్లాడాలి. గ్రామీణ అభివృద్ధి, సామాజిక బాధ్యత లాంటివి ఈ సినిమా చూసి నేర్చుకోవాలి. గ్రేట్ జాబ్ మహేష్” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక కేటీఆర్ ట్వీట్‌కు మహేష్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమాలో ఊరు గొప్పదనాన్ని, ఊర్లలో ఉన్న సహజ వనరులు ఎలా దోపిడీకి గురవుతున్నాయన్నది కమర్షియల్ అంశాలతో జోడించి తెరకెక్కించారు. ఈ ప్రయత్నానికి అన్ని వర్గాలనుండీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఐదు రోజుల్లోనే 50 కోట్లకు పైనే వసూళ్ళు సాధించి శ్రీమంతుడు బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు