వర్మ నాటకీయ కోణాల్ని వదిలేశాడా ?

Published on Mar 11, 2019 11:50 am IST

ఒక సినిమా డైరెక్టర్ ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని విలన్ గా చూపిస్తూ సినిమా తియ్యడాన్ని వివాదం అనే చిన్న పదంతో పోల్చి చూడలేం. ఈ సినిమా వివాదానికి మించిన రాజకీయ క్రీడ. రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని సినిమా చేయడం, అది కాస్త రిలీజ్ కి దగ్గర పడటంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి బాగానే హడావుడి నడుస్తోంది.

ఈ సినిమా నుండి వర్మ మొదటిగా రిలీజ్ చేసిన వెన్నుపోటు పాటతో మొదలు పెట్టి ఆ తరువాత టీజర్, ట్రైలర్ లతో వివాదాలకు మించిన స్థాయిలోనే ఆర్జీవీ ప్రవర్తించాడు. పైగా అంతటితో ఆగకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు మీద నెగిటివ్ కామెంట్స్ పెడుతూ.. సినిమాకి బాగానే హైప్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఈ సినిమా విడుదల అవుతుందా ? అని చాలామంది ఇప్పటికీ అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

అయితే తాజాగా ఈ సినిమా విడుదల గురించి వర్మ మాట్లాడుతూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకోవడం అంటే తనను చంపడంతో సమానమని.. తనను చంపాకే ఈ సినిమాను అడ్డుకోగలుగుతారని వర్మ చెప్పుకొచ్చాడు. లీగల్ గా సినిమాని అడ్డుకోవాలని చూసినా, దాన్ని ఎలా పేస్ చేయాలో తనకు తెలుసని అన్నాడు. ఒకవేళ సినిమా థియేటర్స్ లో విడుదల కాలేకపోతే.. యూట్యూబ్ లో ఫ్రీగా విడుదల చేసేలా ప్లాన్ చేసినట్లు వర్మ తెలిపాడు.

ఏమైనా సినిమాని రిలీజ్ చేసి తీరుతానంటున్నాడు. వర్మ మొత్తానికి తెలుగు తమ్ముళ్ల మనోభావాలతో బాగానే ఆడుకుంటున్నాడు. అయితే వారి మనోభావాలు బాగా దెబ్బ తింటే మాత్రం.. వర్మ దానికి తగ్గ భారీ మూల్యం చెల్లంచుకోకతప్పదు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన వెన్నుపోటు ఘట్టం కేవలం ఒక వ్యక్తి చేసింది కాదు, అప్పటి పరిస్థితులు, పార్టీలోని అప్పటి ప్రముఖ నాయకులందరీ అభిప్రాయాలు, అన్నిటికీ మించి ఎన్టీఆర్ కుంటుంబం సభ్యుల అవసరాల రీత్యా.. ఎన్టీఆర్ ను సీఎం పీఠం నుండి దించేయడం జరిగింది.

కానీ ఇన్నీ పెద్ద నాటకీయ కోణాల్ని వర్మ వదిలేసి… పూర్తిగా ఒక వ్యక్తే ఎన్టీఆర్ ను దించేసాడని చూపించడం ఎంతవరకు సమంజసం. మొత్తానికి దేశంలోనే పేరొందిన ఒక సీనియర్ నాయకుడి మొత్తం జీవితానికి సంబంధించిన అత్యంత విలువైన విషయాన్ని, వర్మ పూర్తి నెగిటివ్ గా చూపిస్తూ భారీ సాహసమే చేసాడని చెప్పాలి.

ఇక ఈ చిత్రం మార్చి 22వ తేదీన విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ తేజ్, చంద్ర బాబు నాయుడు పాత్రలో నటించగా.. ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో నటించిన ప్రముఖ కన్నడ నటి యజ్ఞ శెట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం :