మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ పూర్తవగానే ఈ సినిమాను మొదలుపెడతారు చరణ్. ఈలోపు శంకర్ కూడ ‘ఇండియన్ 2’ పనులు ముగిస్తారు. శంకర్ లాంటి క్రేజీ దర్శకుడితో చరణ్ సినిమా చేస్తుండటంతో ఆయన అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. శంకర్ సినిమాలంటే ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. టేకింగ్, టెక్నాలజీ సంగతులు పక్కనబెడితే కథ విషయంలోనే మెస్మైరైజ్ చేసేస్తారు ఆయన.
దీంతో చెర్రీ కోసం ఆయన ఎలాంటి కథ రాసి ఉంటారో అని ఆసక్తిగా ఉన్నారు అభిమానులు. అయితే సామజిక మాధ్యమాల్లో మాత్రం సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్లో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. గతంలో శంకర్ ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీని రెడీ చేసుకున్నానని చెప్పి ఉండటంతో చరణ్ సినిమా అదే కథతో ఉండబోతుందని భావిస్తున్నారు అందరూ. మరి ఈ ఊహ ఎంతమాత్రం నిజమువుతుందో చూడాలి. ఈ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.


