విషాదం : లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

విషాదం : లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Published on Jul 11, 2026 9:50 PM IST

భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో తన అద్భుతమైన స్వరంతో కొన్ని దశాబ్దాల పాటు శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన లెజెండరీ గాయని ‘దక్షిణాది గానకోకిల’గా పిలవబడే ఎస్.జానకి (88) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జానకమ్మ మరణవార్తతో టాలీవుడ్‌తో పాటు మొత్తం దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో జన్మించిన జానకి, చిన్నతనం నుంచే సంగీతంలో శిక్షణ పొందారు. 1957లో తమిళ చిత్రం ‘విధియిన్ విలయట్టు’తో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, అదే ఏడాది తెలుగులో ‘ఎమ్మెల్యే’ సినిమాలోని “నీ నవ్వే నీ జగాన..” అనే పాటతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆరు దశాబ్దాల పాటు సాగిన ఆమె సుదీర్ఘ ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు దాదాపు 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి భారతీయ సంగీత రికార్డుల్లో అగ్రస్థానాన నిలిచారు.

పసితనం ఉట్టిపడే చిన్న పిల్లల గొంతు మొదలుకొని, పండితులను సైతం మెప్పించే క్లిష్టమైన శాస్త్రీయ సంగీతం వరకు అన్నింటినీ తన గళంలో పలికించడం జానకమ్మకే చెల్లింది. ముఖ్యంగా గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన వేలాది డ్యూయెట్లు చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. ఆమె అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా 4 సార్లు జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు ఉత్తమ గాయనిగా పురస్కారాలు లభించాయి.

అలాగే మైసూర్ విశ్వవిద్యాలయం నుండి ఆమె గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దక్షిణాది కళాకారులకు దక్కాల్సిన గుర్తింపు ఆలస్యంగా దక్కిందనే కారణంతో 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మభూషణ్’ అవార్డును తిరస్కరించి తన ఆత్మగౌరవాన్ని, నిష్కల్మషమైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారామె. సంగీత సామ్రాజ్ఞి ఎస్. జానకి గారి మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరియు కోట్లాది మంది అభిమానులు తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నారు.

తాజా వార్తలు