
మెగా ఫ్యామిలీ నుంచి ఈమధ్యే ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్, తాజాగా విడుదలైన ‘కంచె’ సినిమాతో తానేంటో నిరూపించుకున్నారు. మొదటి సినిమా ముకుందాతోనే మంచి మార్కులు కొట్టేసిన వరుణ్, విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందించిన ‘కంచె’తో తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వరుణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందిస్తోన్న లోఫర్ సినిమా వరుణ్‌కు స్టార్‌డమ్ తెచ్చిపెట్టే సినిమాగా మొదట్నుంచీ ప్రచారం పొందుతూ వస్తోంది.
పూరీ జగన్నాథ్ సినిమా అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లోఫర్ కూడా క్యారెక్టరైజేషన్‌లో కొత్తదనం చూపిస్తూ వరుణ్ తేజ్ హీరోగా మాస్ ఇమేజ్ కూడా తెచ్చిపెట్టేలా ఉండనుందని తెలుస్తోంది. నిన్న సాయంత్రం విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు అంతటా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గత కొద్దిరోజుల క్రితం టైటిల్ మారుస్తున్నట్లు ప్రచారం జరిగినా, చివరకు లోఫర్ టైటిల్‌నే ఖరారు చేసేశారు.
ఇక ఫస్ట్‌లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో రేపు ఈ సినిమాకు సంబంధించిన ఓ థియేట్రికల్ ప్రోమోను రిలీజ్ చేయనున్నట్లు పూరీ ప్రకటించారు. రేపు ఉదయం 9:24 నిమిషాలకు లోఫర్ థియేట్రికల్ ప్రోమోను విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న లోఫర్ ఆడియో, సినిమా డిసెంబర్ నెల్లో విడుదల కానున్నాయి. సి. కళ్యాణ్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో దిశా పఠాని హీరోయిన్‌గా నటించింది.

