బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ప్రియదర్శి, నాగదుర్గ హీరోహీరోయిన్లుగా నూతన చిత్రం ‘ఇడుపు కాయితం’ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ విడుదల చేయగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు దిల్ రాజు, నవీన్ యెర్నేని, ఎస్ కేఎన్, చందూ మొండేటి సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీకృష్ణ దొండపాటి మాట్లాడుతూ .. ‘మా ‘ఇడుపు కాయితం’ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. కథ వినగానే నమ్మి సపోర్ట్ చేసిన తబిత గారితో పాటు సుకుమార్, బన్నీ వాస్, ప్రియదర్శి, వేణు ఊడుగుల, పూజారి నాగేశ్వరరావు, బూసం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రొడ్యూసర్ తబిత సుకుమార్ మాట్లాడుతూ.. ‘నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన పక్కా తెలంగాణ అమ్మాయిని. దర్శకుడు వంశీ ఈ కథ చెబుతున్నప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి, ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లిపోయాను. అందుకే ఈ కథ వినగానే ‘మనం సుకుమార్ రైటింగ్స్‌లో ఈ సినిమా చేస్తున్నాం అంతే’ అని సుక్కుతో గట్టిగా చెప్పాను. వంశీ క్యారెక్టర్స్, ఎమోషన్స్ చాలా బాగా రాశారు. ఈ రోజు పోస్టర్ చూశాక కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి వంద శాతం కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఇది సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా అవుతుంది..’ అని అన్నారు.
ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘సబ్‌టైటిల్స్‌తో బిహార్‌లో వేసినా ఆకట్టుకునేంత అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ ఇది. ప్రతి ఇల్లాలు, అత్తామామలు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు వంశీ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మా దగ్గరకు తీసుకువచ్చిన హీరో ప్రియదర్శికి థ్యాంక్స్. ఇక హీరోయిన్ నాగదుర్గ సినిమా ఒప్పుకునే ముందు మాకు 15 కండీషన్స్ పెట్టింది. ఒక తెలుగమ్మాయికి తన పరిధులపై ఉన్న క్లారిటీ చూసి ముచ్చటేసింది. ఆమె కోసం ఒక స్పెషల్ డ్యాన్స్ నెంబర్ ప్లాన్ చేస్తున్నాం. ఇంత మంచి సినిమాను మిస్ కానందుకు చాలా సంతోషంగా ఉంది.’ అని అన్నారు.
హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ..‘యూట్యూబ్ డ్యాన్సర్‌గా నన్ను ఆదరించిన ప్రేక్షకుల ముందుకు ఇప్పుడు ‘ఇడుపు కాయితం’ చిత్రంతో హీరోయిన్‌గా వస్తున్నాను. ఇందులో నేను చేస్తున్న ‘శ్రీలత’ అనే బరువైన పాత్రను డైరెక్టర్ వంశీ నాపై నమ్మకంతో అప్పగించారు. నా టాలెంట్‌ను గుర్తించి, ప్రోత్సహించిన నిర్మాతలు బన్నీ వాస్, సుకుమార్ గారికి థ్యాంక్స్. నా 25వ బర్త్ డేను సుకుమార్ గారి సమక్షంలో జరుపుకోవడం, ఈ బ్యానర్‌తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం మర్చిపోలేని అనుభూతి. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది.’ అని అన్నారు.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘ఇడుపు కాయితం లాంఛింగ్ ఈవెంట్ చూడటం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఇందులో నేను ‘శ్రీనివాస్’ అనే పాత్రలో కనిపించబోతున్నాను. ఇది తెలంగాణ నేపథ్య సినిమా అయినప్పటికీ, దీని మూలాలు ప్రతి ఇంట్లో ఉంటాయి.. కాబట్టి ఇది గర్వంగా చెప్పగలిగే ఒక గ్లోబల్ స్థాయి సినిమా. దర్శకుడు వంశీ ఈ కథ చెప్పినప్పుడు ఇది నా కథ అని నమ్మాను. మాపై ఇంతటి ప్రేమను చూపిస్తున్న నిర్మాతలు సుకుమార్, బన్నీ వాస్, తబిత గారికి ధన్యవాదాలు. ఇకపై మాటల్లేవు, ఏమున్నా సినిమాతోనే చూపిస్తాం’ అన్నారు.
ఈ కార్యక్రమంలో నటులు బిత్తిరి సత్తి, రచ్చ రవి, మైమ్ మధు, అభయ్ బేతిగంటి, తీన్మార్ సావిత్రి, చంద్రవ్వ, జోర్దార్ సుజాత, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తదితరులు పాల్గొని మాట్లాడారు.


