
ఒక్కడు, వర్షం, మువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్‌బస్టర్‌ల సినిమాల ప్రస్తావన రాగానే గుర్తొచ్చే పేరు ఎమ్మెస్ రాజు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌పై పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించి, సంక్రాంతి రాజుగా పిలిపించుకున్న నిర్మాత ఎమ్మెస్ రాజు, గత నాలుగేళ్ళుగా సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన తన కుమారుడు సుమంత్ అశ్విన్ కెరీర్‌ను నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. సినీ పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు అయిన సందర్భంగా ఎమ్మెస్ రాజు మీడియాతో ముచ్చటిస్తూ తన భవిష్యత్ ప్రణాళికలను తెలిపారు.
మస్కా తర్వాత సినీ నిర్మాణానికి విరామం ఇచ్చి కుమారుడు సుమంత్ అశ్విన్ యాక్టింగ్ కెరీర్‌ను నిర్మించానని, ఆ రకంగా ఈ నాలుగేళ్ళు మంచి సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఇక ఇప్పుడు సుమంత్ అశ్విన్ కూడా మెల్లిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడంతో ఎమ్మెస్ రాజు మళ్ళీ సినిమాలను నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలంతా తనకు ఇప్పటికీ సపోర్ట్ ఇస్తున్నారని, వచ్చే ఏడాది ఒక స్టార్ హీరోతో తమ బ్యానర్‌లో సినిమా ఉంటుందని తెలిపారు. తమ బ్యానర్‌లో ఈ స్టార్ హీరో గతంలో నటించారన్న క్లూ కూడా ఎమ్మెస్ రాజు ఇచ్చారు. మరి సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌లో నటించిన స్టార్ హీరోలైన మహేష్, ప్రభాస్, వెంకటేష్, సిద్ధార్థ్‌లలో ఎవరితో ఎమ్మెస్ రాజు సినిమా మొదలుపెట్టనున్నారన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

