శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించిన చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న 200కు పైగా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత, నటుడు లక్ష్మణరావు మీడియాతో పంచుకున్నారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో తాను ప్రతినాయకుడి పాత్ర పోషించగా, సీనియర్ నటుడు సుమన్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారని తెలిపారు. వీరిద్దరి మధ్య వచ్చే కీలక సన్నివేశాలు, మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరించిన విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు.
హీరో శ్రీరామ్ ద్విపాత్రాభినయంలో ఆకట్టుకుంటారని, దర్శకుడు మైకిల్ కథ, మాటలు, పాటలతో పాటు దర్శకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని చెప్పారు. దాదాపు 14 నెలల పాటు శ్రమించి సిద్ధం చేసిన ఈ చిత్రంలో సమ్మెట గాంధీ, బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మనీష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.


