సమీక్ష : మహర్షి – రిషి ‘టు’ మహర్షి ఎమోషనల్ జర్నీ !

Published on May 10, 2019 4:02 am IST
Maharshi movie review

విడుదల తేదీ : మే 09, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : మహేష్‌ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌, జగపతి బాబు, ప్రకాష్ రాజ

దర్శకత్వం : వంశీ పైడిపల

నిర్మాత : దిల్‌ రాజు, పీవీపీ, అశ్వనీదత

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద

సినిమాటోగ్రఫర్ : కే యూ మోహనన

ఎడిటర్ : కే ల్ ప్రవీణ

‘మహర్షి’ రాక కోసం సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు అత్యధిక థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ :

రిషి (మహేష్ బాబు) చిన్నప్పటి నుండి తన తండ్రి (ప్రకాష్ రాజ్ ) ఫెయిల్యూర్స్ ను చూసి.. జీవితంలో వేగంగా గెలవాలని కసిని పెంచుకుంటాడు. అలాగే ఉంటాడు.. అనుకున్నది అంతే వేగంగా సాధిస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం తన కాలేజ్ రోజుల్లో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటాడు. ఆ సంఘటనల కారణంగా తన కాలేజీ ఫ్రెండ్ రవి (అల్లరి నరేష్) తన కోసం చేసిన ఓ పని రిషిని కదిలిస్తోంది. అలాగే తనని ప్రేమించిన పూజా హెగ్డే ప్రేమ గురించి కూడా రిషి అర్ధం చేసుకుంటాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనల కారణంగా రిషి ‘సీఈఓ’ స్థాయిలో ఉండి కూడా వ్యవసాయం చేస్తాడు. అసలు రిషి ‘సీఈఓ’ నుండి రైతుగా ఎందుకు మారాల్సి వస్తుంది.? చివరికి రిషి తన ఫ్రెండ్ రవి కోసం ఏం చేశాడు ? అసలు రవి పాత్ర వెనుకున్న కీలక అంశం ఏమిటి? ఆ అంశం కారణంగా రిషి ‘రిషి నుండి మహర్షి’గా ఎలా ఎదిగాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఎన్నో అంచనాల మధ్యన వచ్చిన ‘మహర్షి’ ఆ అంచనాలను అవలీలగా అందుకున్నాడు. మహేశ్ స్టార్ డమ్ కి తగ్గట్లు వంశీ పైడిపల్లి ఎంచుకున్న సబ్జెక్ట్ ‘మహర్షి’ని మరో స్థాయిలో నిలబెట్టింది. ఒక్క మాటలో ‘మహర్షి’ అందరికీ కనెక్ట్ అయ్యే ఎంగేజింగ్ సోషల్ థ్రిల్లర్ అని చెప్పాలి. పైగా అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో ‘మాహర్షి’ మెప్పిస్తాడు. అన్నిటికి మించీ మహేశ్ మరోసారి తన నటనతో అబ్బురపరుస్తారు.

కాలేజీ కుర్రాడిగా, కంపెనీ సీఈఓగా, ఓ రైతుగా ఇలా మూడు విభిన్నమైన పాత్రల్లో.. మూడు డిఫరెంట్ షేడ్స్ తోనూ.. ప్రతి పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటిలాగే మహేశ్ తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. తన గత చిత్రాల్లో కంటే, ఈ చిత్రంలో మహేశ్ నటన ఇంకా చాలా బాగుంది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే తన స్టన్నింగ్ లుక్, గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఆలాగే కీలక పాత్రలో నటించిన కామెడీ హీరో అల్లరి నరేష్, మహేశ్ తరువాత సినిమాలోనే హైలెట్ గా నిలిచాడు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో నరేష్ నటన చాలా బాగుంది. అలాగే మరో ప్రధాన పాత్రలో నటించిన జగపతి బాబు కూడా ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. అలాగే జయసుధ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, సాయి కుమార్ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకుంటారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి ఎక్కడా కథను ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు. సినిమాలో బావోద్వేగాలను.. హృదయానికి హత్తుకున్నేలా ఆయన చాలా చక్కగా చూపించారు.

 

మైనస్ పాయింట్స్ :

కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు చాలా సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు.. మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో మొదట అర్ధగంటలో వచ్చే ఆ సన్నివేశాలను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం వాట్ని సింపుల్ గా నడిపారు.

ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేసినప్పటికీ.. కొన్ని చోట్ల పెద్దగా వర్కౌట్ కాలేదు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ మొదటి పార్ట్ లో కొన్ని సీన్స్ సాగతీతగా అనిపిస్తాయి. ఇక హీరో తానూ అనుకున్నది సాధించే క్రమంలో వచ్చే సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆసక్తికరంగా సాగదు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీనే తక్కువ అనుకుంటే… ఉన్నదాన్ని కూడా సరిగ్గా ఎలివేట్ చెయ్యలేదు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. రచయితగా దర్శకుడిగా వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు ఆడియో పరంగా పెద్దగా ఆకట్టుకోకపోయినా.. సినిమాలో విజువల్ గా మాత్రం పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి.

ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపధ్య సంగీతం చాలా బాగుంది. అలాగే కేయూ. మోహనన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ ఆయన కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఇక ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, ప్రసాద్ వి పొట్లూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

ముందుగానే చెప్పుకున్నట్లు ఎన్నో భారీ అంచనాల మధ్యన వచ్చిన ‘మహర్షి’.. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్లో అనిపించినా.. మొత్తానికి అభిమానుల అంచనాలను అయితే అందుకోగలిగాడు. మహేశ్ బాబు స్టార్ డమ్ కి తగ్గట్లు, వంశీ పైడిపల్లి ఎంచుకున్న సబ్జెక్ట్ ‘మహర్షి’ని హిట్ స్థాయిలో నిలబెట్టింది. అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో అందరికీ కనెక్ట్ అయ్యే ఎంగేజింగ్ సోషల్ థ్రిల్లర్ గా సాగుతూ ‘మాహర్షి’ మెప్పిస్తాడు. అన్నిటికి మించీ మహేశ్ మరోసారి తన నటనతో అబ్బురపరుస్తారు.

అయితే బలమైన కథతో, పాత్రలతో ఆకట్టుకున్నప్పటికి.. కొన్ని సన్నివేశాలను మాత్రం దర్శకుడు నెమ్మదిగా నడిపించారు. పైగా సినిమాలో లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోదు. సినిమాలో లవ్ స్టోరీనే తక్కువ అనుకుంటే… ఉన్న లవ్ స్టోరీని కూడా సరిగ్గా ఎలివేట్ చెయ్యలేదు. అయితే మహేశ్ బాబు తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో తన అభిమానులను బాగా అలరిస్తారు. మొత్తం మీద ‘మహర్షి’ మహేశ్ బాబు అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :