
నేటి నుండి కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే, మహేష్ బాబు 15 రోజుల తర్వాత ఈ నెలాఖరున షూటింగ్ లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీతో కలసి ఫారిన్ ట్రిప్ వేశారు. మలేషియాలో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. తన కొత్త సినిమా విడుదల తర్వాత మహేష్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం షరా మామూలే.
మహేష్ బాబు ఇండియా తిరిగొచ్చేసరికి ముఖ్య తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కించనున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాలో మహేష్ బాబుతో తొలిసారి జోడి కడుతుంది శృతి హాసన్. దీనికి ముందు ‘ఆగడు’లో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.