
‘ఆగడు’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు – ‘మిర్చి’ ఫేం కొరత శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘శ్రీ మంతుడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. మే 2వరకూ అక్కడే షూటింగ్ జరుపుకొని మే 3న ఈ చిత్ర టీం హైదరాబాద్ కి తిరిగి రానున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కోసం ఒక రిలీజ్ డేట్ ని ఖరారు చేసారు.
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా మే 31న మహేష్ బాబు శ్రీ మంతుడు ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు గతంలో ‘దూకుడు’, ‘1- నేనొక్కడినే’ సినిమాల ఫస్ట్ టీజర్స్ ని కృష్ణ గారి బర్త్ డే రోజునే రిలీజ్ చేసారు. ఈ లోపుగా ఈ చిత్ర టీం ఈ సినిమా టైటిల్ ని కూడా ఫైనలైజ్ చేయనున్నారు. మహేష్ బాబు సరసన మొదటి సారి శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే జగపతి బాబు, సుకన్యలు కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చేయనున్నారు.

