
తెలుగు సినిమా దర్శకుల రెండో సినిమా విషయంలో ఓ బలమైన సెంటిమెంట్ ఉంది. ద్వితీయ విజ్ఞంగా పిలుచుకునే ఈ సెంటిమెంట్ ప్రకారం, మొదటి సినిమా బంపర్ హిట్ కొట్టిన దర్శకులు రెండో సినిమా విషయంలో విఫలమైపోతారనేది ఎప్పట్నుంచో వినిపిస్తూ వస్తోంది. రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి కొందరు దర్శకులను పక్కనబెడితే పూరీ జగన్నాథ్, నందిని రెడ్డి, కరుణాకరన్, దశరథ్ తాజాగా సుధీర్ వర్మ.. ఇలా ద్వితీయ విజ్ఞాన్ని జయించలేకపోయిన దర్శకులెందరో!
కాగా మహేష్ సినిమాల విషయంలో మాత్రం ద్వితీయ విజ్ఞం అనే కాన్సెప్ట్ దర్శకులకు పనిచేయదని అభిమానులకు మరో కొత్త సెంటిమెంట్ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ (అతడు), శ్రీకాంత్ అడ్డాల (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) ఇలా తమ రెండో సినిమాను మహేష్‌తో చేసిన దర్శకులు రెండో ప్రయత్నంలోనూ మంచి విజయం సాధించారు. తాజాగా ఆ కోవలోనే దర్శకుడు కొరటాల శివ వచ్చి చేరారు. మహేష్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా కొరటాల శివకు దర్శకుడిగా రెండో సినిమా. ‘మిర్చి’ లాంటి సూపర్ హిట్ తర్వాత ఆయన చేసిన ఈ సినిమా కూడా ద్వితీయ విజ్ఞాన్ని దాటేసి విజయం సాధించింది. దీంతో మహేష్ అభిమానుల సెంటిమెంట్ మళ్ళీ పనిచేసినట్లైంది.
గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ‘శ్రీమంతుడు’ సినిమా, మొదటి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటివారం ముగియకముందే ఈ సినిమా 50 కోట్లు వసూలు చేయనుందని ట్రేడ్ టాక్. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు మహేష్ సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు.

